RSS, BJP దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నయ్ : డి . రాజా

RSS, BJP దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నయ్ : డి . రాజా

మోడీ పాలన గాడి తప్పిందని సీపీఐ జాతీయ జనరల్ సెక్రెటరీ డి. రాజా ఆరోపించారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగ సమస్య ఘననీయంగా పెరుగుతోందని చెప్పారు. కార్పొరేట్ లకు మోడీ అనువైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆయన.. జాతీయ లా కమిషన్ నుంచి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరపడంపై తమ అభిప్రాయం కోరిందన్నారు. రెండు ఎన్నికలు ఒకే సారి జరపాలన్నది ఆర్ఎస్ఎస్ విధానమని, ఇది ఖచ్చితంగా సాధ్యం కాదని తెలిపారు. మోడీ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదన్న డీ. రాజా.. నోట్లరద్దుపై సుప్రీంకోర్టు  ఏకపక్షంగా తీర్పు ఇవ్వలేదని, భిన్నాభిప్రాయాలతో కూడిన జడ్జ్ మెంట్ వెలువరించిందని ఆరోపించారు.

అత్యుత్తమ రాజ్యాంగ సంస్థ అయిన పార్లమెంట్ లోనూ దీనిపై సంప్రదించలేదని డీ రాజా చెప్పారు. నోట్ల రద్దుకు మోడీ చెప్పిన ఏ ఒక్క రిజన్ కూడా సరిగా అమలు కాలేదని ఆరోపించారు. నోట్ల రద్దు పేదవారిపై తీవ్ర ప్రభావం చూపిందని, నోట్ల రద్దు పాలసీ ప్రధాని మోడీ తీసుకుని ఆర్బీఐపై రుద్దారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశం సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారన్న ఆయన.. గవర్నర్ ఆఫీసులను వినియోగించి బీజేపీ,  ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసేందుకు వాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరిలోనూ అదే జరుగుతుందని చెప్పారు. గవర్నర్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

కంప్రెహెన్సీవ్ ఎన్నికల విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాజా అన్నారు. ఎన్నికల కు కార్పొరేట్ ల ఫండింగ్ విధానం వద్దని తామే వాదించామని, అయినా బీజేపీ బలవంతంగా బిల్లు ఆమోదించుకుని బాండ్స్ రూపంలో భారీగా నిధులు సేకరిస్తోందని ఆరోపించారు. ఒక్క లాంగ్వేజ్ ను దేశ ప్రజలపై రుద్దాలని చూస్తోందని, తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని, హిందీ, సంస్కృతానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా వాటికి ఇవ్వడం లేదని విమర్శించారు. మతం పేరుతో మైనార్టీలపై, వెనుకబడిన వర్గాలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే దేశంలో అనేక పట్టణాల పేర్లు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఐఖ్యతను కాపాడేందుకు వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రాజా పిలుపునిచ్చారు. అంతకంటే ముందే అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, అన్ని ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రజాస్వామ్య పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. జాతీయ, రీజినల్ లెవెల్ లో అంతా కలిసి పరిస్థితులకు అనుగుణంగా కలిసి పని చేయాలని చెప్పారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలను ఓడించేందుకు రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతామని స్పష్టం చేశారు.