సైన్యానికి అండగా నిలవాల్సిన సమయమిది: RSS చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

సైన్యానికి అండగా నిలవాల్సిన సమయమిది: RSS చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

Mohan Bhagwat: పాకిస్థాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కాపాడుకునేందుకు నేరుగా భారత ఆర్మీతో పాటు సరిహద్దు గ్రామాల్లోని సాధారణ పౌరులపై మిస్సైల్స్, డ్రోన్ అటాక్స్ ప్లాన్ చేస్తూ పూర్తిగా నిరాశకు గురవుతోంది. మెుదటి నుంచి పూర్తిగా సన్నద్ధంతో ఉన్న భారత ఆర్మీ పాక్ చర్యలను అదే స్థాయిలో తిప్పికొడుతూ భారీగా ఆస్తి నష్టంతో పాటు పాక్ ప్రభుత్వ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ చర్యలను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు, ప్రభుత్వాలు స్వాగతిస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రీయ సేవా సంఘ్( RSS) కూడా స్వాగతించింది. దేశంలోని పౌరులందరూ తమ దేశభక్తిని చూపించాలని సమయం ఇదేనంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్థానిక అధికార యంత్రాంగంతో పాటుగా సాయుధ దళాలకు తమ సహకరాన్ని అందించాలని సూచించారు. వారికి ఏ సమయంలో ఎలాంటి సహాయం కావాలన్నా ముందుకు రావాలని, దేశ ఐక్యతకు రక్షణకు తమ వంతు సహకారం ప్రజలు ఈ సమయంలో అందించాలన్నారు. 

గడచిన రెండు రోజులుగా పాక్ చర్యలను అంతర్జాతీయంగా ఎండగడుతూనే మరో పక్క ఆర్మీ ధీటుగా చర్యలను కొనసాగిస్తూ ఆపరేషన్ సిందూర్ ని ముందుకు తీసుకెళ్లటాన్ని మోహన్ భగవత్ ప్రశంశించారు. పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం, వారు చేస్తున్న దాడుల్లో పహల్గామ్ బాధిత కుటుంబాలకు దీంతో న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ భూభాగంలో పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడులను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని అన్నారు మోహన్ భగవత్. ఈ క్రమంలో దేశం ఆర్మీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 

పాక్ ఆర్మీ సామాన్యులపై, ఆధ్యాత్మిక స్థలాలపై, పౌరుల నివాసాలపై చేసిన దాడుల్లో మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో మనమందరం జాగ్రత్తగా ఉంటూ.. సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు దేశ వ్యతిరేక శక్తులు చేసే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్.