- సంఘ్.. ఓ మహోద్యమం
- ఇప్పటివరకు నాలుగు సార్లు నిషేధం విధించి.. ఉపసంహరించుకున్నరు
- సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశవ్యాప్తంగా 96,045 సేవా కార్యక్రమాలతో ఒక మహోద్యమంలా ముందుకు సాగుతోందని సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లోని కేశవ స్మారక కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925లో స్థాపించబడిన సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గృహ సంపర్కం, సద్భావ సమావేశాల వంటి కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయి వరకు విస్తరించిందన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 88,949 దైనందిన శాఖలు నడుస్తుండగా, తెలంగాణలో గతేడాది కంటే 375 కొత్త శాఖలు పెరిగి మొత్తం 3,492కి చేరాయని వివరించారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్లపై కూడా ఆయన స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఎదుగుతున్న నేపథ్యంలోనే నిషేధాన్ని విధించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారన్నారు. నిషేధం అనేది ఆర్ఎస్ఎస్కు కొత్త కాదని, ఇప్పటివరకు నాలుగు సార్లు నిషేధం విధించారని.. తిరిగి ఆ నిషేధాన్ని ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించినంత మాత్రాన సంఘ కార్యక్రమాలు ఆగవని, ఇది మహా ఉద్యమమని స్పష్టం చేశారు.
