
రవాణా శాఖ అధికారులు వీసీఆర్( వెహికిల్ చెక్ రిపోర్ట్) ను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వీసీఆర్ రిపోర్ట్ ను తమకు నచ్చిన సమయంలో ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. దీంతో వాహనాదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ నెల 15న ఓ మోటార్ క్యాబ్ డ్రైవర్ కు ఈ అనుభవం ఎదురైంది. తన వెహికల్ ను చెక్ చేసిన రవాణా శాఖ అధికారులు రూల్స్ పాటించలేదని రూ.5,125 రూపాయల ఫైన్ వేసి అతడి వెహికల్ ను సీజ్ చేశారు. సమీపంలోని ఆర్టీసీ బస్టాప్ వద్ద ఆ వెహికల్ ను ఉంచారు. రవాణా శాఖ అధికారులు విధించిన ఫైన్ ను కట్టేందుకు వెహికల్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యిందో అదే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి కట్టాల్సి ఉంటుంది. దీంతో సోమవారం ఆ క్యాబ్ డ్రైవర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిన తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. రెండు రోజుల క్రితం తమ క్యాబ్ కు ఫైన్ వేశారని..అది కట్టి వెహికల్ ను తీసుకెళ్తానని క్యాబ్ డ్రైవర్ ఆర్టీఏ అధికారులను కోరాడు. కానీ ఆ వెహికల్ పై ఎలాంటి ఫైన్ ఉన్నట్టు ఆన్ లైన్ లో చూపించడం లేదని ఆర్టీఏ అధికారులు చెప్పారు. దీంతో ఆశ్చర్యానికి గురైన క్యాబ్ డ్రైవర్ తన వెహికల్ ను సీజ్ చేసిన తర్వాత కూడా ఆన్ లైన్ లో ఎందుకు వివరాలను నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించాడు. దీంతో అధికారులు దీని గురించి తమకు తెలియదని సమాచారం ఇచ్చారు. తనకు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటే గానీ రోజు గడవదని..సీజ్ చేసిన వెహికల్ ను ఫైన్ కట్టి తీసుకెళ్లేందుకు ఆన్ లైన్ వివరాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నరు…
వాస్తవానికి ఎప్పటికప్పుడు వీసీఆర్ రిపోర్ట్ ను ఆన్ లైన్ లో నమోదు చేయాలి. కానీ ఈ విషయంలో రవాణా శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెహికల్ ను సీజ్ చేసిన తర్వాత నాలుగు రోజులకు కూడా ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చటం లేదు. ఇది తెలియక వాహనదారులు తమ వెహికల్ ను విడిపించుకోవటానికి ఆర్టీఏ కార్యాలయాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. నిత్యం ఆర్టీఏ ఆఫీసుల చుట్టు ఇలా తిరుగుతున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటోందని తెలుస్తోంది. సీజ్ అయిన వెహికల్ వివరాలు వెంటనే ఆన్ లైన్ లో పొందుపరిస్తే అప్పటికప్పుడు ఫైన్ కట్టి వెహికల్ ను విడిపించుకునే వీలు ఉంటుంది. క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సహా ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ నడిపే డ్రైవర్లు తమ వెహికల్ సీజ్ చేసిన ఒక్కరోజులోనే విడిపించుకునేందుకు అప్పులు చేసి మరీ ఫైన్ కట్టేందుకు కోసం డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఇలా ఆన్ లైన్ వివరాలు రాకపోవటంతో సదరు రవాణా అధికారి ఎప్పుడెప్పుడు తమ వెహికల్ ను సీజ్ చేసిన వివరాలను ఆన్ లైన్ పొందుపరుస్తాడని వారు ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో వీసీఆర్ రిపోర్ట్ ను నమోదు చేయలేకపోతున్నామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.