- ప్రకటించిన ఆర్టీఏ శాఖ అధికారులు
- స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా ఓనర్ అడ్రస్‌కు ఆర్సీ
హైదరాబాద్, వెలుగు: కొత్త వెహికల్ కొంటే దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను మరింత ఈజీ చేసే దిశగా ఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ అయ్యే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీఏ శాఖ అధికారులు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విధానంతో ఇకపై కారు, బైక్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, సులభమైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నాన్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌కు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని, అదికూడా మొదటిసారి రిజిస్ట్రేషన్ కు మాత్రమేనని వారు వెల్లడించారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్–1989లోని రూల్ 48బీ ప్రకారం అధికారిక ఆటోమోబైల్ డీలర్ ద్వారా అమ్ముడుపోయిన కొత్త వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ విధానంతో వాహనం కొనుగోలు చేసిన షోరూం డీలర్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేస్తారని వెల్లడించారు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు డీలరే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారని తెలిపారు. ఆర్సీ నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా ఓనర్‌కు పంపిస్తామని చెప్పారు. ఈ విధానంతో ప్రజలకు టైం ఆదా అవుతుందని, పైగా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా సాగే అవకాశం ఉంటుందని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఈ విధానం వర్తించదని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు.
