కోరుట్ల, వెలుగు: ప్రయాణికుడు మరిచిపోయిన పర్సులో ఉన్న పదితులాల బంగారం, పాస్ పోర్టును బస్సు డ్రైవర్లు నిజాయతీగా అందజేశారు. కోరుట్ల ఆర్టీసీ డిపో బస్సు లో ఓ ప్రయాణికుడు తన పర్సు పొగొట్టుకున్నాడు. బస్సు డ్రైవర్లు దాన్ని అతడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు గురువారం వింజమూరు నుంచి కోరుట్ల వస్తుండగా ప్రయాణికుడు సికింద్రాబాద్లో ఎక్కి జగిత్యాల వరకు వచ్చారు. జగిత్యాలలో దిగిపోయేటప్పుడు తన పర్సు ను మర్చిపోయాడు. ఆ పర్సు ను డ్రైవర్లు తిరుపతి, లక్ష్మణ్ లు కోరుట్ల డిపోకు తీసుకువచ్చి డిపో అధికారులకు అప్పగించారు.
పర్సులో ఉన్న ఆధారాలతో ప్రయాణికుడు దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన స్వీపతి సత్తన్నగా గుర్తించి అతడికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కోరుట్ల ఆర్టీసీ డీఎం లక్ష్మీ ప్రసూన ఆధ్వర్యంలో ప్రయాణికుడు స్వీపతి సత్తన్నకు పర్సు లో ఉన్న పాస్ పోర్ట్ , 2 సెల్ ఫోన్లు, 10 తులాల బంగారం వస్తువులు సిబ్బంది అప్పగించారు. నిజాయితీ చాటిన డ్రైవర్లకు, ఆర్టీసీ సిబ్బందికి తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటారని ప్రయాణికుడు సంతోషం వ్యక్తం చేశాడు. బస్ డ్రైవర్లు తిరుపతి, లక్ష్మణ్, ట్రాఫిక్ సూపరింటెండెంట్ వెంకటేశం, సీఆర్సీ రాంమోహన్,కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్, సెక్యూరిటీ సిబ్బంది శ్రావణి పాల్గొన్నారు.