కిక్కిరిసిపోతున్నయ్ : ఆర్టీసీ బస్సు ఎక్కని స్టూడెంట్స్​

కిక్కిరిసిపోతున్నయ్ : ఆర్టీసీ బస్సు ఎక్కని స్టూడెంట్స్​

హైదరాబాద్‍, వెలుగుఆర్టీసీ అందజేసే డిస్కౌంట్‍, ఉచిత బస్ పాస్ లను తీసుకునేందుకు స్టూడెంట్స్ ఇంట్రస్ట్ చూపించడం లేదు.  పదో తరగతి దాకా చదివే అమ్మాయిలకు, ఏడో తరగతిలోపు చదివే అబ్బాయిలకు ప్రభుత్వం ఉచిత బస్‍ పాస్‍ అందజేస్తుంది. ఇంటర్‍, డిగ్రీ, ఇంజినీరింగ్‍ కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ నెలకు రూ.130తో డిస్కౌంట్‍ పాస్‍ అందజేస్తున్నారు. వీటిని పొందేందుకు స్టూడెంట్స్ ఇంట్రస్ట్ చూపిస్తలేరు.  ఇంటర్‍, డిగ్రీ, ఇంజినీరింగ్‍ కాలేజీల స్టూడెంట్స్ మాత్రమే బస్‍ పాస్ లను ఎక్కువగా వాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ కొందరు ప్రభుత్వం అందించే ఉచిత బస్ పాస్ లను తీసుకుంటున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏటా 1.10లక్షల నుంచి 1.15 లక్షల బస్ పాస్ లను జారీ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ప్రైవేటు వెహికల్స్ కే ప్రయారిటీ

గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలో  దాదాపు 2,200 స్కూల్స్ ఉన్నాయి. సుమారు 50 ఇంజినీరింగ్‍ కాలేజీల వరకు ఉంటాయి. ఇందులోనూ సిటీ శివారుల్లో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాకుండా సుమారు 500 ఇంటర్‍ కాలేజీలున్నాయి స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో సుమారు 5 నుంచి 6 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ  స్కూల్స్, కాలేజీల్లో చదివే  స్టూడెంట్స్ లో  కేవలం 17 శాతం మందే ఆర్టీసీ బస్  పాస్‍ వాడుతున్నట్టు  అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ ను వినియోగిస్తున్నారు. ప్రైవేటు ఇంటర్‍, ఇంజినీరింగ్‍ కాలేజీలకు చెందిన వారు ఎక్కువగా పర్సనల్ వెహికల్స్ లో వెళ్లేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. సిటీలోని కాలేజీల్లో చదివే స్టూడెంట్స్  సమయం ఆదా అవుతుందని మెట్రో, ఎంఎంటీసీ ట్రైన్‍లలో వెళ్తున్నారు. పైగా సిటీలోని అన్ని కాలనీలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో స్టూడెంట్స్ ప్రైవేట్‍ వెహికల్స్ వాడేందుకు మొగ్గు చూపుతున్నారు.

కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లలేక

ప్రైవేట్‍, కార్పొరేట్‍ స్కూల్స్ తమ స్టూడెంట్స్ ను తీసుకొచ్చి, దింపేందుకు సొంతంగా బస్సులను నడుపుతున్నాయి.  ఇదే విధంగా పలు ప్రైవేట్‍ ఇంజినీరింగ్ కాలేజీలు స్టూడెంట్స్ కోసం సొంత ట్రాన్స్ పోర్టులో  తీసుకెళ్లి, తిరిగి ఇండ్ల వద్ద దింపుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో స్కూళ్లకు, కాలేజీలకు ఇన్ టైంలోగా చేరుకోవడం కష్టమని..పైగా అవసరాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వాటిలో వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. స్కూల్స్, కాలేజీల టైమింగ్స్ ప్రకారం..ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు ఫుల్ రష్ తో ఉండటం వల్ల అందులో ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉంటుందని స్టూడెంట్స్ అంటున్నారు.  మరో ప్రత్యామ్నాయం లేని స్టూడెంట్స్ మాత్రమే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారు. స్టూడెంట్స్ కు  స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు అనువైన సమయాల్లో సరిపడా బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెస్తే.. స్కూల్, కాలేజీ బస్సులకు కట్టే వేలాది రూపాయలు మిగిలే అవకాశముంటుందని స్టూడెంట్స్, పేరెంట్స్ చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు స్టూడెంట్స్ కు అవసరమైన రూట్లలో, ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.