కొచ్చి: సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నేవీలోకి ప్రవేశించింది. కేరళలో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ లో ఇక్షక్ ను నేవీలో చేర్చారు. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి సమక్షంలో ఈ నౌక జలప్రవేశం చేసింది. సర్వే వెసెల్ లార్జ్ (ఎస్ వీఎల్) తరగతిలో ఇది మూడో నౌక. అలాగే, సదరన్ నావల్ కమాండ్ లో చేరిన మొదటి నౌక.
నీటి లోపల మ్యాపింగ్, సర్వే కోసం ఈ నౌకను ఉపయోగిస్తారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ అనే సంస్థ ఈ నౌకను నిర్మించింది. నౌక నిర్మాణంలో 80 శాతం దేశీయ మెటీరియల్ వాడారు. ‘ఇక్షక్’ అంటే సంస్కృతంలో గైడ్ అని అర్థం.
పోర్టుల కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి, నావిగేషన్ కోసం ఈ నౌకను అభివృద్ధి చేశారు. సముద్రంలో నౌకలను మరింత సేఫ్ గా నేవిగేట్ చేయడానికి ఇక్షక్ సహాయపడుతుంది. దీంతో మన తీరప్రాంత రక్షణ మరింత బలోపేతం కానుంది. ఐఎన్ఎస్ ఇక్షక్ చేరికతో భారత నేవీలో మరో మైలురాయి పడిందని రక్షణ శాఖ
అధికారులు తెలిపారు.
