TheGirlfriend Review: ప్రేమలో కొత్తకోణం చూపించిన రష్మిక.. బ్రేక‌ప్ చెప్పగానే థియేట‌ర్లో చ‌ప్ప‌ట్లే.. అసలేముంది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ ప్రేమలో?

TheGirlfriend Review: ప్రేమలో కొత్తకోణం చూపించిన రష్మిక.. బ్రేక‌ప్ చెప్పగానే థియేట‌ర్లో చ‌ప్ప‌ట్లే.. అసలేముంది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ ప్రేమలో?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ (TheGirlFriend). నటుడు రాహుల్‌‌ రవీంద్రన్‌‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించింది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌‌‌‌తో సినిమాపై వీపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో యూత్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ రొమాంటిక్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీగా తెరకెక్కిన్న ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 7న) తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మరో హిట్ను తన ఖాతాలో వేసుకుందా? ప్రేమలో మరోకోణాన్ని చూపించడానికి వచ్చిన ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ ఎలా ఉంది? ప్రివ్యూస్ చూసిన ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? రాహుల్-రష్మిక ప్రయోగం సక్సెస్ అయిందా? ‘బయట ఉన్న అమ్మాయిల అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా’ అని చెప్పడమే కాదు.. ఆ మాటని రష్మిక నిలబెట్టుకుందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే?

పురుడుపోసుకోగానే తల్లిని పోగొట్టుకుంటుంది భూమా దేవీ (రష్మిక మందన్న). అమ్మప్రేమ తెలియని అన్నీ తానై నడిపిస్తాడు నాన్న (రావు రమేష్). తల్లిలేని బిడ్డ కావడంతో.. అడిగింది కాదనకుండా ఎంతో ప్రేమతో పెంచుతాడు తండ్రి రావు రమేష్.  భూమా దేవీ కూడా చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పెరుగుతుంది. అలా థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్‌పై భూమా దేవీ మక్కువ పెంచుకుంటుంది. దీంతో ఎప్పుడూ తండ్రి దగ్గరే ఉండే భూమా దేవీ ఫస్ట్ టైం తండ్రిని వదిలి పట్నం వస్తుంది. రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పీజీ MA లిటరేచర్లో జాయిన్ అవుతుంది.

ఈ క్రమంలోనే అదే కాలేజీలో ఉండే విక్రమ్ (దీక్షిత్ శెట్టి)తో భూమా ప్రేమలో పడాల్సి వస్తుంది. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి.. అనూహ్య పరిస్థితుల్లో విక్రమ్తో ఎలా ప్రేమలో పడింది? ప్రేమలో పడటం వల్ల ఎలాంటి విక్రమ్తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది?  వీరి మధ్య దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటీ?

ఒక ముద్దుతో మొదలైన విక్రమ్- భూమా దేవీల ప్రేమ.. హద్దులు ఎలా దాటింది? భూమాదేవి స్వేచ్ఛను హరించే ఆ ప్రేమ ఎలాంటిది? అసలు టాక్సిక్ రిలేషన్ అంటే ఏమిటీ? కూతురు భూమా దేవీ చేసే తప్పుడు పనితో.. తండ్రిగా రావు రమేష్ ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? చివరికి భూమా దేవి-విక్రమ్‌ల ప్రేమ కథ ఏమైంది? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

అడగలేని ప్రశ్నలు, చెప్పలేని ఫీలింగ్స్‌‌కు సమాధానం 'ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌'. అవును. ‘ఎన్నో విలువలు ఉన్న సినిమా ఇది. మనం జీవితంలో కొన్ని ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. మనలో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా మాటల్లో వాటిని వివరించలేం. అలాగే మనం అడగలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటన్నింటికీ సమాధానమే ఈ సినిమా’. ప్రేమకథలో ఒక కొత్త కోణం చూపించింది ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’. 

సహజంగా "ప్రేమ" అనే ఫీలింగ్ వెనుక ఎన్నో నిజజీవిత కథలున్నాయి. అందులో కొన్ని గొప్పగా ఉంటాయి. మరికొన్ని చెత్తగా ఉంటాయి. ఇంకొన్ని అయితే.. ఒకరొకొకరు కలిసి చచ్చేంతలా ఉంటాయి. కానీ, ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ ప్రేమ మాత్రం.. నేటి సమాజ మాయాజాలంలో మునిగి తేలినట్టుగా ఉంటుంది. అంటే.. తండ్రి ప్రేమ, చదువుపై ధ్యాస.. ఇవే ప్రపంచంగా బ్రతికే అమ్మాయికి.. ఓ కొత్త పరిచయం.. ప్రేమ పేరుతో విష‌పూరిత‌మైన బంధాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలో ఓ సగటు అమ్మాయి పడే మనోవేదన ఆవిష్కృతమే ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ ప్రేమ.

అయితే, బయట ప్రతి అమ్మాయి.. ‘ప్రేమ పేరుతో ఏర్ప‌డే బంధాలను మొదట్లోనే గమనించుకోక, చివరికి ఉక్కిరిబిక్కిర‌య్యి అయిపోయి జీవితాలను ముగించుకుంటున్నారు’. కానీ, ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ మాత్రం ఆలోచ‌న రేకెత్తించేలా సాగింది. ప్రేమలో మోసపోయి, తండ్రి ముందు పరువుపోయి.. ఇలా తెలిసి తెలియక మోసిన బరువుని.. అంతులేని బాధతో ఎలా ముందుకు వెళ్ళింది? టాక్సిక్ రిలేషన్లో చిక్కుకున్న భూమా దేవీ చివరికి ఎలాంటి ఆలోచనలతో బయటపడింది? అనేది ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ ఓవరాల్ కథ.

డైరెక్టర్ రాహుల్ నేటి స‌మాజానికి ఎంతో అవ‌స‌ర‌మైన కథ‌ని తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. తెర‌పైన జరిగే సంఘర్షణలతో.. చూసే ఆడియన్స్కి ఇవి మన లైఫ్లో కూడా జరిగాయి అని అనుకునే ఆలోచ‌నను రేకెత్తించేలా చేశాడు రాహుల్. 

ఈ సినిమా కథ విన్న తర్వాత హీరోయిన్ రష్మిక.. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడకుండానే ఓకే చెప్పింది అని సినిమా ప్రమోషన్స్లో విన్నాం. అంతే కాకుండా.. ‘ఇలాంటి కథ ఆడియెన్స్‌కు చెప్పాలి.. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను.. బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా’ అని తన అభిప్రాయం పంచుకుంది.

నిజానికి సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచింపజేసే కథతోనే వచ్చింది రష్మిక. ప్రమోషన్స్లో భాగంగా, ఊరికే ఏదో చెప్పాలని కాకుండా.. చెప్పిన ఆ మాటని నిలబెట్టుకుని శభాష్ అనిపించుకుంది రష్మిక.

ఫస్టాఫ్ విషయానికి వస్తే.. భూమా-తండ్రి రావు రమేష్ సీన్స్, ఆ తర్వాత అమాయకురాలైన భూమా కాలేజీకి వచ్చి.. ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయితో లవ్లో పడటం, ఆ త‌ర్వాత హీరో పాత్ర న‌డ‌వ‌డికలో చేంజెస్ బయటకి రావడం ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇంటర్వెల్ టైంలో కథను మ‌లిచిన తీరు, అక్క‌డ హీరోయిన్‌ని ప్రజెంట్ చేసిన విధానం ఆసక్తిగా ఉంటుంది.

సెకండాఫ్లో ప్రేమలో పడిన తర్వాత భూమా లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఇందులో భాగంగా తండ్రి కూతురి మధ్య ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్.. ఆలోచింపజేస్తాయి. ‘బదులు లేని ప్రశ్నలకు భయపడి నీ నుంచి నువ్వు పారిపోకు.. నువ్వు నచ్చినవాడి విన్నపాలనే కాదు.. నీ మనసు కోరుకునే విన్నపాలను విను’ అనేలా భూమా ప్రయాణం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్లో రష్మిక ఇచ్చే స్పీచ్తో అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ.. కచ్చితంగా ఆలోచిస్తారు. 

ఓవరాల్గా.. ఎమోషనల్ సీన్స్, ఎవరికీ మెసేజ్‌లు ఇవ్వకుండా ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరితో మూవీ ఆలోచింపజేసేలా చేస్తుంది. పెద్ద సూట్ కేస్‌ని ఈడ్చుకుంటూ హాస్ట‌ల్‌లో అడుగుపెట్టింది మొదలు.. క్లైమాక్స్‌‌లో భూమా విజృంభించే సీన్ వరకూ ప్రతి ఫ్రేమ్.. ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. మొత్తానికి ‘ష‌ర‌తులు లేని ప్రేమే జీవితాన్ని, అందులోని అందాన్ని స‌జీవంగా నిలుపుతుంద‌ని’ డైరెక్టర్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ద్వారా ఇచ్చిన మెసేజ్ మెప్పిస్తుంది.

ఎవరెలా నటించారంటే?

రష్మిక మందన్న 'భూమా దేవీ' పాత్రలో ఒదిగిపోయింది. కేవలం నటించింది అని చెప్పడం కంటే ఆ పాత్రలో జీవించింది అని చెప్పడం కరెక్ట్.  భిన్నమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసేలా చేసింది. డైరెక్టర్ రాసుకున్న భూమా దేవీ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. హీరో దీక్షిత్ శెట్టి తన పాత్రలో బాగుంది. మరోసారి తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయెలా నటించాడు. అను ఇమ్మానుయేల్ తనదైన పాత్ర పోషించి ఆకట్టుకుంది. రావు ర‌మేశ్ తండ్రి పాత్రలో మరోసారి తన నట ప్రతిభను చూపించారు. రోహిణి తన పాత్రలో ఒదిగిపోయింది. డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ లెక్చ‌ర‌ర్‌గా కనిపించి ఆకట్టుకున్నారు.