- రాజకీయాల్లోకి వచ్చాకే డబ్బులు పోగొట్టుకున్న: రాంచందర్ రావు
- ప్రజా సేవ చేసేందుకు మనీ అవసరం లేదు
- జూబ్లీహిల్స్‌లో దీపక్‌రెడ్డిని గెలిపించాలి
- మేధావులు, పారిశ్రామికవేత్తలతో బీజేపీ స్టేట్ చీఫ్
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ వెనుకబాటుతనానికి మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కారణమని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. పదేండ్లుగా బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయలేదని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల, పారిశ్రామికవేత్తల సమావేశం వెంగళరావు నగర్‌లోని ముగ్ధ బ్యాంకెట్ హాల్ లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘‘డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ఉంది. కానీ, నేను మాత్రం రాజకీయాల్లోకి వచ్చాకే డబ్బులు పోగొట్టుకున్న.
ప్రజాసేవ చేయాలంటే డబ్బులు అవసరం లేదు. సేవ చేయాలన్న తపన ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చాం. అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మేధావులు, పారిశ్రామికవేత్తలపై ఉంది. మేధావులు మౌనంగా ఉంటే.. దేశం అభివృద్ధిలో వెనుబడుతుంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌ను పదేండ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గానీ, రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి గాని పట్టించుకోలే. ఎక్కడ చూసినా మురుగునీరు, రోడ్డు పక్కన చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ముస్లింలకు అన్యాయం చేస్తున్నది’’అని రాంచందర్ రావు విమర్శించారు.
ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కుట్రలు
తాయిలాలు, బుజ్జగింపులతో 20 శాతం ఉన్న ముస్లింల ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయని రాంచందర్ రావు ఆరోపించారు. ‘‘నరేంద్ర మోదీ సర్కారు వచ్చాకే ముస్లింలకు ఫ్రీ రేషన్, ఇండ్ల నిర్మాణం, మహిళలకు రక్షణ లభించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు.. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సారథ్యంలో హైదరాబాద్ డెవలప్ అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సిటీని అభివృద్ధి చేయలేదు. మేధావులంతా కలిసి దీపక్ రెడ్డిని గెలిపించాలి’’అని రాంచందర్ రావు కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫైలెట్ బాబి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
