బిహార్లో కూడా హర్యానా తరహా కుట్రలే: ప్రియాంక గాంధీ

బిహార్లో కూడా  హర్యానా తరహా కుట్రలే: ప్రియాంక గాంధీ
  • ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఎన్డీయే సర్కార్ కూలుతుంది

మోతిహీరి: హర్యానాలో ఓట్ల చోరీకి పాల్పడ్డట్టు బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి పాల్పడాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘రాజ్యాంగాన్ని,  ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా బీజేపీ, ఈసీ కలిసి పనిచేస్తున్నాయి. హర్యానాలో ఓట్లను ఎలా చోరీ చేశారో.. అదేవిధంగా బిహార్​లోనూ 65 లక్షల ఓట్లను తొలగించారు. దీని ద్వారా ఓట్ల చోరీకి వారు రెడీ అయ్యారు” అని ఆమె దుయ్యబట్టారు. 

బిహార్​లోని సీతామఢి, ఈస్ట్​ చంపారన్​లో గురువారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడారు. ‘‘రాహుల్​గాంధీ  పోరాటం జనం కోసం. మహాత్మాగాంధీ  స్ఫూర్తిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నవారిని జనం ముందు ఎండగడుతున్నారు” అని తెలిపారు. 

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవాళ్లను, ద్రోహులను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని బీజేపీని హెచ్చరించారు. ‘‘బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతం జరిగితే ఎన్డీయే సర్కార్​ కూలిపోతుంది. అందుకే వాళ్లు కుట్రలు పన్నుతున్నారు. కుట్రలను పేదలు, మహిళలు, యువత కలిసి తిప్పికొట్టాలి” అని ఆమె సూచించారు.