
నేరడిగొండ(ఇచ్చోడ), వెలుగు: ఆర్టీసీ బస్సు, ఆటో, ఆయిల్ ట్యాంకర్ వరుసగా ఢీకొన్న ఘటనలో మహిళ చనిపోయిన ఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇచ్చోడ శివారులోని రాణి జిన్నింగ్ మిల్లు సమీపంలో గురువారం నేషనల్ హైవే పై నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు ఆర్టీసీ బస్సు స్పీడ్ గా వెళ్తుంది. ఒక్కసారిగా రోడ్డుపై పశువులు రావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయగా అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది.
దీంతో దాని వెనకాలే స్పీడుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్, ఆటో బస్సును ఢీ కొట్టాయి. బస్సు, ఆటోలోని 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 108లో ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించగా బోరజ్ మండలం మండగడకు చెందిన మహిళ భీమక్క(65) చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనలో నాలుగు పశువులు మృతి చెందాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చోడ ఎస్ఐ తిరుపతి తెలిపారు.