మార్గమధ్యంలో ఆగుతున్న ఆర్టీసీ బస్సులు

మార్గమధ్యంలో ఆగుతున్న ఆర్టీసీ బస్సులు

ఈ మధ్య కాలంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పదే పదే ఆర్టీసీ బస్సు మొరాయించడం. మార్గమధ్యంలో బస్సులు ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిపేర్ వచ్చినపుడు అప్పటి వరకు ఏదో ఒకటి చేసి, నామమాత్రంగా సమస్యను పరిష్కరిస్తున్నారు. కానీ రిపేరైన బస్సుల స్థానంలో కొత్త బస్సులు వేయడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తు్న్నారు. ఆర్టీసీ రూల్స్ ప్రకారం ఒక బస్సు 15ఏళ్ల సర్వీసు పూర్తయినా.. లేదంటే 12లక్షల కి.మీ. తిరిగినా ఆ బస్సును పక్కన పెట్టాల్సిందే. కానీ ప్రస్తుతం 17లక్షల కి.మీ. ప్రయాణించిన బస్సులు కూడా ఆర్టీసీ బస్టాపుల్లో కనిపించడం గమనార్హం. కాగా ప్రస్తుతం 15ఏళ్ల పూర్తయిన 424 బస్సులు. 16లక్షల కి.మీ.338 బస్సులు, 17 లక్షల కి.మీ. తిరిగిన 331 బస్సులున్నాయి. వీటితో పాటు ప్రజా రవాణాలో ముందు నుంచే 2వేల బస్సులున్నాయి.

మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 15ఏళ్లు ప్రయాణించిన వాహనాలన్నీ పక్కన పెట్టాల్సిందే. దీని ప్రకారం 3వేల బస్సులు ఒకే సారి పక్కన పెట్టడం సాధ్యమేనా.. అన్ని బస్సులను మళ్లీ రిప్లేస్ చేయగలుగుతారా అన్న ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బస్సులో ప్రయాణించాలంటే చాలా భయంగా ఉంటుందని, కాలం చెల్లిన బస్సులను వాడుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని బస్సులైతే సమయానికి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ ఛార్జీలను పెంచడంపై ఉన్న దృష్టి, ప్రజల కష్టాలను తీర్చడంపై లేదని మండిపడుతున్నారు.'