ఆర్టీసీ కార్మికుల్లో అసంతృప్తి ఉంది : బాజిరెడ్డి

ఆర్టీసీ కార్మికుల్లో అసంతృప్తి ఉంది : బాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల్లో అసంతృప్తి ఉందని, ఆ విషయం వారిని చూస్తే అర్థమవుతున్నదని ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తను, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కార్మికుల సమస్యపై సీఎంతో చర్చించామని.. ఆయన సానుకూలంగా ఉన్నారని త్వరలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గతేడాది ఉత్తమ పనితీరు కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, అధికారులను మంగళవారం ఆర్టీసీ కళాభవన్ లో ‘ప్రగతిచక్రం యాన్యువల్ అవార్డ్స్, రోల్ ఆఫ్ హానర్’ పేరుతో సన్మానించారు.

 ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఇబ్బందుల్లో ఉన్నా ఏడు డీఏలు ఇచ్చామని, గతంతో పోలిస్తే జీతాలు పెరిగాయన్నారు. పెండింగ్ లో ఉన్న మరో డీఏ కూడా త్వరలో ఇస్తామన్నారు. సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. 394 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, 75 మంది ఆఫీసర్స్ కు అవార్డ్స్ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ నష్టం రూ.2 వేల కోట్లు ఉంటే రూ.600 కోట్లకు తగ్గించుకున్నామని, ఇందులో ప్రతి కార్మికుడు, ఉద్యోగి కృషి ఉందని చెప్పారు. రాఖీ, దసరా, సంక్రాంతి, శ్రావణ మాసం చాలెంజ్ లకు అందరూ మంచిగా పనిచేశారని, మంచి రెవెన్యూ సాధించామన్నారు. తార్నాక హాస్పిటల్ కు నిత్యం 1500 మంది ట్రీట్ మెంట్ కు వస్తున్నారని, హాస్పిటల్ ను ఎంతో డెవలప్ చేశామని తెలిపారు. కార్మికుల, ఉద్యోగుల ఆరోగ్యం కోసం గ్రాండ్ హెల్త్ చాలెంజ్ నిర్వహించామని, 2 వేల మంది ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామన్నారు. ఈ ఏడాది కూడా రెవెన్యూ పెరిగేలా కృషి చేయాలని కార్మికులకు 
పిలుపునిచ్చారు.