త్వరలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు!

త్వరలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు!
  • టికెట్ల ధరలు 25 నుంచి 30%  పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదన
  • సీఎం దగ్గరికి చేరిన ఫైల్
  • 15 శాతం వరకు పెంచేందుకు సర్కార్‌ సిద్ధం?
  • ప్రయాణికులపై ఏటా  రూ.500 కోట్ల భారం
  • ఎలక్షన్‌ కోడ్ ముగియగానే ప్రకటించే చాన్స్‌
  • సిబ్బంది వేతన సవరణ, నష్టాల తగ్గింపు కోసమే నిర్ణయం
  • రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెరగని టికెట్ల ధరలు

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. త్వరలో బస్సు టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఉద్యోగుల వేతనాలు, డీజిల్​ ధరల పెంపుతో మరింత భారం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైల్‌ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ వద్దకు చేరిందని, ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్‌ ముగియగానే చార్జీలు పెంచవచ్చని తెలుస్తోంది. టికెట్ల ధరలను 25, 30 శాతం పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదించిందని, సర్కారు మాత్రం 15 శాతం వరకు పెంచడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఈ 15 శాతం చార్జీలు పెరిగినా ప్రయాణికులపై ఏటా సుమారు రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా టికెట్​ ధరలు పెంచారు. ఇప్పుడు చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ఆర్టీసీ టికెట్ల ధరలు పెరిగినట్టు అవుతుంది. అయితే 2016లో చిల్లర మార్పిడి సమస్యలను అధిగమించడానికి టికెట్ల ధరలను సర్దుబాటు చేశారు.

డీజిల్​ రేట్లు డబుల్

రాష్ట్రంలో గత ఆరేళ్లలో డీజిల్​ ధరలు సుమారు రెండు రెట్లు పెరిగాయి. 2013లో  లీటర్​ డీజిల్‌‌‌‌ ధర రూ. 44 మేర ఉండగా.. ఇప్పుడు రూ. 75 వరకు ఉంది. టికెట్‌‌‌‌ ధరలు పెంచకపోవడంతో ఆ భారమంతా ఆర్టీసీపైనే పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏటా వెయ్యి కోట్ల రూపాయలు డీజిల్‌‌‌‌ కోసమే ఖర్చవుతోంది. రాష్ట్రంలో మొత్తం 97 డిపోలు ఉండగా, 27 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఆర్టీసీకి రోజూ సుమారు రూ.12 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. ఖర్చు రూ.14 కోట్ల వరకు ఉంటోంది. సగటున రోజుకు రూ.2 కోట్ల మేర నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎనిమిది నెలల కింద ఆర్టీసీ నష్టాలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన ఆ కమిటీ.. పలు ప్రతిపాదనలు చేయడంతోపాటు టికెట్‌‌‌‌ ధరలు పెంచడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చార్జీల పెంపుపై ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.

ఇబ్బందుల్లో కార్మికులు

వేల కోట్లలో నష్టాల్లో ఉండటంతో ఆర్టీసీ నడవడమే కష్టంగా మారింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికే నానా తంటాలు పడుతోంది. ఉద్యోగులకు ఐఆర్‌‌‌‌ చెల్లించాల్సి వస్తుందన్న కారణంగా అంతర్గత పనులను వాయిదా వేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని పనులకు నిధుల్లేక సిబ్బంది నుంచి చందాలు వసూలు చేసుకోవాల్సిన వస్తోందని, ఇలాగైతే బస్సులను నడపటం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. కార్మికుల సీసీఎస్‌‌‌‌ డబ్బును సైతం సంస్థ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రిటైరైన ఎంప్లాయీస్​కు సొమ్ము చెల్లించడం లేదు. చాలా అంశాల్లో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

అడ్డగోలుగా ట్యాక్స్​లు

విమానయాన సంస్థలను ఆదుకుంటామంటూ ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌‌‌‌ను నాలుగైదు శాతానికి తగ్గించడంతో ఎయిర్​లైన్స్​సంస్థలకు ఉపశమనం లభించింది. అలాంటిది నిత్యం కోటి మంది సాధారణ జనం ప్రయాణించే ఆర్టీసీని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్​పై ఏకంగా 26.5 శాతం పన్ను కడుతోంది. దీనిని తగ్గిస్తే వందల కోట్ల భారం తగ్గుతుంది. పైగా చార్జీలు కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఉండదని కార్మిక నేతలు చెబుతున్నారు.