ఖమ్మం చేరిన శ్రీనివాస్ రెడ్డి మృతదేహం: కాపాడుకోలేకపోయామంటూ విలపించిన కొడుకులు

ఖమ్మం చేరిన శ్రీనివాస్ రెడ్డి మృతదేహం: కాపాడుకోలేకపోయామంటూ విలపించిన కొడుకులు

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహం ఖమ్మం చేరుకుంది. హైదరాబాద్ లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రి నుంచి ఖమ్మంలోని ఆయన నివాసానికి అంబులెన్స్ లో భౌతిక కాయాన్ని తరలించారు పోలీసులు. ఇంటి వద్దకు చేరుకోగానే ఆయన కుటుంబం బోరున విలిపించింది. తమ తండ్రిని కాపాడుకోలేకపోయామన్న బాధతో తల్లడిల్లిపోయారు ఆయన కొడుకులిద్దరు.

ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు తండ్రిని కాపాడే ప్రయత్నంలో కుమారుడికి రెండు చేతులు కాలిపోయాయి. గాయాలైన చేతులకు కట్లు కట్టుకుని, తండ్రి మృతదేహం వద్ద విలపిస్తుంటే.. కళ్లు చమర్చని వారు లేరు. అతడి తల్లడిల్లిపోతుంటే చూడలేక..  కార్మికులు ఇంట్లోకి తీసుకెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు.

భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నేతలు, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్ రెడ్డికి నివాళి అర్పించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటివారు సంతాపం తెలిపారు. కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

రాత్రి వేళలోనే అంత్యక్రియలు

తెల్లవారితే కార్మికులు, ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉందని ఇంతటి రాత్రి వేళలోనే శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోలీసులు అంత్యక్రియల ఏర్పాట్లు చేయడంపై కార్మికులు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.