మంటల్లో కాలుతుండగా.. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మాటలివే

మంటల్లో కాలుతుండగా.. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మాటలివే

అంత బాధలోనూ కార్మికుల బాగు గురించే..

48 వేల మంది ఉద్యోగాలు నిలబడాలని నినాదాలు

ఖమ్మం: మంటల్లో ఒళ్లంతా కాలిపోతున్నా.. ఆ కార్మికుడి గొంతు ఆర్టీసీ బాగు కోసమే నినదించింది. ప్రాణం తోడేసేంత బాధలోనూ.. తోటి కార్మికుల మేలు గురించే ఆ గుండె రగిలింది. 48 వేల మంది బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదనతో ఆత్మత్యాగానికి సిద్ధపడిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి.. మంటల్లో కాలుతున్న సమయంలో సంస్థ బాగుండాలంటూ కేకలు వేశారు.

‘‘ఆర్టీసీ కార్మికులంతా బాగుండాలే. 48 వేల మంది ఉద్యోగాలు నిలబడాలి. వాళ్ల ఉద్యోగాలు వాళ్లకు రావాలి..’’

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కారు తీరుతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మంటల్లో కాలుతున్నప్పుడు అన్న మాటలివి. 90శాతం కాలిన గాయాలతో ఆయన హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు.

ఇద్దరు కుమారులూ సైన్యంలో 

ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న ఆయన కుటుంబంతో ఖమ్మం నగరంలోనే ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఆర్మీలో, మరొకరు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నారు.

20 ఏళ్లకు పైగా ఆర్టీసీలో పని చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. కార్మిక సంఘం టీఎంయూలో ఉన్న ఆయన సమ్మెలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు డిమాండ్లతో ఏడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సమ్మెలో ఉన్నవారంతా ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టేనని, ఇక వారిని డ్యూటీలోకి తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ ఇవాళ మరోసారి ప్రకటించారు. కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పెండింగ్ ఉన్న సెప్లెంబరు జీతం కూడా సమ్మెకు దూరంగా ఉన్న ఉద్యోగులకు మాత్రమేనని ప్రకటించారు.

సీఎం కేసీఆర్ మధ్యాహ్నం చేసిన ఈ ప్రకటన వల్లే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు చెబుతున్నారు. 48 వేల మంది ఉద్యోగాలు ఇక లేవని, సెప్టెంబర్ జీతం కూడా సమ్మెలో లేనివారికే అని ప్రకటించడంతోనే శ్రీనివాస్ రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్యాహత్నానికి ప్రయత్నించాడని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాహత్నంతో రగిలిపోయిన కార్మికులు, విపక్షాలు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు.