రాయికోడ్, వెలుగు: రన్నింగ్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కాపాడాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి డిపో ఆర్టీసీ బస్సు రోజూ జోగిపేట నుంచి వట్టిపల్లి వెళ్తోంది. శనివారం మధ్యాహ్నం బస్సు సంగారెడ్డి నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్తుండగా పల్వట్ల సమీపంలో డ్రైవర్ జనార్దన్ ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అప్రమత్తమైన అతను వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
ఎందుకు ఆపారని అడగగా తనకు చాతిలో నొప్పిగా ఉందని డ్రైవర్ జనార్దన్ తెలిపాడు. వెంటనే 108కు ఫోన్ చేయగా.. వచ్చి డ్రైవర్‌ను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ డ్రైవర్ జనార్దన్(50) చనిపోయాడు. అతని సొంతూరు అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యమిచ్చి డ్యూటీని బాధ్యతగా నిర్వర్తించిన డ్రైవర్ జనార్దన్ తీరును పలువురు మెచ్చుకున్నారు.
