
- పులుల సంరక్షణపై అవగాహన పెంచేలా ఆర్టీసీ వినూత్న ప్రోగ్రామ్
హైదరాబాద్,వెలుగు: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఇండియన్ ఫొటో ఫెస్టివల్ (ఐపీఎఫ్), ఐసీబీఎం -స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ సంస్థలు సహకారం అందించాయి. పులుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన 'ప్రాజెక్ట్ టైగర్' కార్యక్రమం 50 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో ఐసీబీఎం -స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ డీన్(అకడమిక్స్), వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గొవిందాని తీసిన పులుల ఫొటోలను ఆర్టీసీ ప్రదర్శిస్తోంది.
డోబ్రియాల్ మాట్లాడుతూ..కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంరక్షణకు తెలంగాణ అటవీ శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ రెండు టైగర్ రిజర్వ్ ల్లో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు. పులులు అడవుల్లో ఉండటం వల్ల మంచి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. వాటిని కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని తెలిపారు. సజ్జనర్ మాట్లాడుతూ..జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
వాటి సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే 'హైదరాబాద్ ఆన్ వీల్స్' కార్యక్రమం తెచ్చామని వివరించారు. జితేందర్ గొవిందాని మాట్లాడుతూ.. దాదాపు 13 ఏండ్లు కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒక్క పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందన్నారు. యువతకు పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్ ప్రతి నిధి తరుషా సక్సేనా తదితరులు పాల్గొన్నారు.