ఆరాంఘర్లో బస్స్టేషన్ .. అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు రవాణా శాఖ ప్లాన్

ఆరాంఘర్లో బస్స్టేషన్ .. అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు రవాణా శాఖ ప్లాన్
  • రూ.100 కోట్లతో 10 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
  • స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ 
  • ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ఆరాంఘర్ లో ఆధునాతన సౌకర్యాలతో బస్​స్టేషన్​ నిర్మించేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అక్కడ ఇప్పటికే పోలీస్​ శాఖకు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు జేబీఎస్ అందుబాటులో ఉండగా.. విజయవాడ, ఖమ్మం, ఇతర ఆంధ్ర ప్రాంత జిల్లాలకు ఇమ్లీబన్ బస్​ స్టేషన్ సౌకర్యవంతంగా ఉంది. 

అయితే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆరాంఘర్ వద్ద బస్సుస్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రవాణా శాఖ భావిస్తున్నది. దీని వల్ల సిటీ లోపల ట్రాఫిక్​ను కూడా తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నది. ఆరాంఘర్ లో అన్ని సౌకర్యాలతో బస్సు స్టేషన్ నిర్మాణానికి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ఆర్టీసీ రెడీ అయింది. స్థలం కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డికి రవాణా శాఖ ఇప్పటికే లేఖ రాసింది. 

మరోవైపు  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై దృష్టి పెట్టారు. సాధ్యమైనంత త్వరగా ఆరాంఘర్ లో బస్సుస్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థలం కేటాయింపు, నిధుల విషయంలో సీఎంతో మాట్లాడుతానని, ఇతరత్రా పనులను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం అధికారులకు సూచించారు.