ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు, గ్రాట్యుటీ సహా ఇతర అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సారధ్య కమిటీ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట ఉపవాస దీక్షకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వందలాదిగా తరలివచ్చిన మాజీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీలోని కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా విశ్రాంత ఉద్యోగులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.
దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బస్ భవన్ ముందు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ ఉపవాస దీక్ష కొనసాగించారు. కమిటీ సభ్యులు పట్టాభి లక్ష్మయ్య, పీవీ రంగారావు, చంద్రారెడ్డి, వెంగళ కనకయ్య, కట్ట ప్రకాష్, సత్యపాల్, చెన్నయ్య, నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
