- అదనపు ఆదాయం కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఏ చిన్న అవకాశం వచ్చినా ఆదాయం పెంచుకోవడంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఒకేసారి రెండు పెద్ద పండుగలు వస్తుండడంతో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే సంక్రాంతి పండుగ.. ఆ వెంటనే మేడారం జాతర రానుడడంతో ఈ రెండింటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపి అదనపు ఆదాయం సమాకూర్చుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఈ నెల 9 నుంచి 13 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 6 వేల 431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే, మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే 3 వేల 495 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని ఇతర డిపోల నుంచి కూడా ఇటు సంక్రాంతికి.. అటు మేడారం జాతరకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపుతామని వారు వివరించారు. రెగ్యులర్ గా నడిచే బస్సుల్లో ఎప్పటి మాదిరిగానే పాత ఛార్జీలనే వసూలు చేస్తారని.. కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనంగా 50 శాతం చార్జీల పెంపు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.
