కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు 790 ప్రత్యేక బస్సులు

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు 790 ప్రత్యేక బస్సులు
  • రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,580 ట్రిప్పులు
  • 15వ తేదీ నుంచి 26 వరకు నడవనున్న స్పెషల్‌‌ బస్సులు

హనుమకొండ, వెలుగు : ఈ నెల 15 నుంచి కాళేశ్వరంలో ప్రారంభంకానున్న సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 790 బస్సులతో 1,580 ట్రిప్పులు నడపనున్నారు. హైదరాబాద్‌‌తో పాటు వరంగల్‌‌ రీజియన్‌‌లోని హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్‌‌ డిపోల నుంచి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

డీలక్స్, సెమీ డీలక్స్, సూపర్‌‌ లగ్జరీ, రాజధాని, గరుడ, ఇతర ఎక్స్‌‌ప్రెస్‌‌ సర్వీసులు నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ నుంచి పరకాల మీదుగా, నర్సంపేట నుంచి హనుమకొండ, ములుగు మీదుగా కాళేశ్వరం వరకు బస్సులు నడపనున్నారు. అలాగే మహబూబాబాద్‌‌, తొర్రూరు, జనగాం, భూపాలపల్లి, పరకాల నుంచి బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్‌‌ నుంచి డీలక్స్‌‌, సెమీ డీలక్స్‌‌, సూపర్‌‌ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్‌‌, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు నడుపనున్నట్లు వరంగల్‌‌ రీజియన్‌‌ మేనేజర్‌‌ డి.విజయభాను ప్రకటించారు.