
- రూ. వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించని సర్కార్
- కార్మి కులకు టైమ్ కి అందని జీతాలు
- రిటైరైనోళ్లకు ఏడాదిగా బెనిఫిట్స్ లేవు
- పెరుగుతున్న డీజిల్ భారం..
- ప్రభుత్వానికి 27% వ్యాట్
- కార్మి కుల సంక్షేమం పైసలు కూడా వాడేసుకున్న సంస్థ
- ఇదే కొనసాగితే ముందుముందు ఏమవుతుందోనన్న భయం
హైదరాబాద్, వెలుగు: ఒకవైపు నష్టాలు.. మరోవైపు అప్పులు.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని నిండా ముంచుతున్నాయి. టైమ్‌కు జీతాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీకి 364 బస్ స్టేషన్లు, 97 డిపోలు, 24 డివిజన్లు, 11 రీజియన్లు ఉన్నాయి. సుమారు 10,400 బస్సులు రోజుకు 98 లక్షల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాయి. 2015లో ఆర్టీసీ విభజన సమయంలో 2 వేల కోట్ల అప్పులు ఉండగా.. ఇప్పుడు అందులో అదనంగా రూ. 1,200 కోట్లు చేరాయి. ప్రస్తుతం రూ. 3,200 కోట్ల అప్పులు పేరుకుపోయాయి. వీటికి తోడు ఏ యేడుకు ఆ యేడు నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఐదేండ్లలో రూ. 3 వేల కోట్లకు పైగా నష్టాలను సంస్థ చవి చూడాల్సి వచ్చింది. 2018–-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 928.67 కోట్ల నష్టం వాటిల్లింది. బడ్జెట్లేకపోవడంతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన రూ. 1,200 కోట్ల సొమ్మును కూడా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఇందులో సీసీఎస్‌కు సంబంధించినవి రూ. 450 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించినవి రూ. 750 కోట్లు ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాది దాటినా డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఏటా పెరిగిపోతున్న నష్టాలు, అప్పులతో రోజుకు సుమారు కోటి రూపాయల దాకా వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీజిల్ మోత.. వ్యాట్వాత
ఆర్టీసీ రోజు ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్ వాడుతోంది. అంటే ఏడాదికి 20 కోట్ల లీటర్ల దాకా వినియోగిస్తోంది. ఏడాదికి సుమారు రూ. 1,300 కోట్లు డీజిల్ కోసమే ఖర్చవుతోంది. రోజురోజుకు డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయని, దీంతో సంస్థపై భారం పెరిగిపోతోందని అధికారులు అంటున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నుంచి డీజిల్‌పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. దీంతో దాదాపు రూ. 300 కోట్లు వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం 10 నుంచి 15 శాతం మాత్రమే వ్యాట్ ఉందని, ఇక్కడ 27 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని అధికారులు, కార్మికులు కోరుతున్నారు.
గ్రేటర్లో నష్టాలెక్కువ
ఆర్టీసీకి గ్రామాలు లాభాలు తెచ్చి పెడుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ నష్టాలు తెచ్చిపెడుతోంది. గ్రేటర్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ పరిధిలోనే రోజూ రూ. 1.20 కోట్ల నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఇలా ఇక్కడే ఏటా రూ. 400 కోట్ల లాస్ వస్తోంది. ఆర్టీసీకి వచ్చే మొత్తం నష్టాల్లో 75 శాతం గ్రేటర్‌లోనే వాటిల్లుతోంది. 80 లక్షల మంది ఉన్న సిటీలో ఆర్టీసీ మూడు వేల బస్సులను నడుపుతోంది. ఇటీవల నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ యూటర్న్‌లు తీసుకొచ్చారు. దీంతో కిలోమీటర్ల దూరం పెరిగిపోయింది. ఫలితంగా దూరం పెరిగి దాంతో డిజిల్ ఖర్చు పెరిగి ఆర్టీసీకి నష్టాలు వాటిల్లుతున్నాయని అధికారులు అంటున్నారు.
పదిరోజులుగా వర్షాల ఎఫెక్ట్
ఆర్టీసీపై వర్షాల ప్రభావం కూడా పడింది. రాష్ట్రంలో రోజుకు సుమారు రూ. 5 కోట్ల ఆదాయం వస్తుందని, పది రోజులుగా వర్షాలు కురవడంతో ప్రయాణికులు ఉండటం లేదని, ఫలితంగా రోజుకు ఆదాయం రూ. 3 కోట్లు కూడా దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. పది రోజుల్లో వర్షాల కారణంగా రూ. 10 కోట్ల ఆదాయం తగ్గిందని అంటున్నారు.
ఒకటో తారీఖు కాదు.. ఏడో తారీఖు
గతంలో ఆర్టీసీలో నెలనెలా జీతాలు సకాలంలో చెల్లించేవారు. ఇటీవల కాలంలో ఐదో తేదీన ఇస్తున్నారు. అయితే గత రెండు, మూడు నెలలుగా ఐదో తేదీ దాటిన తర్వాతే జీతాలు సర్దుతున్నారు. ఈ నెల 7న జీతాలు పడ్డాయి. ఇలా టైమ్‌కు జీతాలు రాకపోవడంతో సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల రూపంలో ఏటా సుమారు రూ. 2,400 కోట్ల దాకా చెల్లించాల్సి వస్తోంది.
సర్కార్ నుంచి పైసలేవి?
టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ విలీనానికి చర్యలు తీసుకుంటున్నారని, గత నెల ఏకంగా సర్కార్ ట్రెజరీ నుంచి జీతాలు చెల్లించారని వారు గుర్తుచేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఆర్టీసీకి రావాల్సిన వివిధ రీయింబర్స్‌మెంట్స్ కూడా సకాలంలో ఇవ్వడంలేదని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీఎస్ ఆర్టీసీకి బకాయిలు రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇటీవల మొక్కుబడిగా రూ. 95 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అంటున్నారు. మిగతా సొమ్మును విడుదల చేసినా ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం ఆర్టీసీకి అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిపిందని వారు విమర్శిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీకి పాలకవర్గం కూడా లేదు. ఇన్చార్జ్ ఎండీ కొనసాగుతున్నారు. దీంతో సరైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ జోరుగా నడుస్తున్నాయి. వాటివల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రావెల్స్‌లో 10 శాతం తగ్గించినా ఆర్టీసీకి లాభం చేకూరుతుందని అధికారులు అంటున్నారు.
నష్టాలకు ప్రభుత్వమే కారణం
ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంక్‌లు వెనకడుగు వేస్తున్నాయి. ఆర్టీసీని కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపై ఉంది. నష్టాలకు ప్రభుత్వమే కారణం. కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారు. లాభాల్లోకి తీసుకొస్తామని గొప్పలు చెప్పారు. ప్రభుత్వం నుంచి సుమారు వెయ్యి కోట్లు ఆర్టీసీకి రావాల్సి ఉంది. ఇవి వస్తే ఆర్టీసీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.
– థామస్ రెడ్డి, టీఎంయూ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
నష్టాలు ఇలా..
- గ్రేటర్ హైదరాబాద్‌లోనే 75% నష్టం.
- ప్రైవేట్ ట్రావెల్స్‌పై నియంత్రణ కరవు.
- డీజిల్ ధరలకు అనుగుణంగా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.
- పాలకవర్గం లేదు. చైర్మన్, ఎండీ లేరు.
- భారంగా అద్దె బస్సులు
- ఇతర మార్గాల్లో ఆదాయంపై దృష్టి పెట్టకపోవడం.
గట్టెక్కించాలంటే..
- ప్రభుత్వం బకాయిలు చెల్లించడం.
- డీజిల్‌పై వ్యాట్ తగ్గించడం.
- కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టడం. కొత్త బస్సులు కొనడం.
- ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం.
- హైదరాబాద్ సిటీని వేరు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
- పూర్తిస్థాయి ఎండీ నియామకం, సంస్థపై అవగాహన ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉండటం.
సీఎం కేసీఆర్ భయపెట్టిస్తున్నడు
గతంలో సమస్యలపై పోరాడితే, సమావేశం పెట్టి ఆర్టీసీని ప్రైవేట్ పరంచేస్తామని సీఎం కేసీఆర్ భయపెట్టించిన్రు. ఆర్టీసీపై కేసీఆర్‌కు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. లీటర్ డీజిల్ రూ. 45 ఉన్నప్పుడు టికెట్ ధర పెంచిన్రు. సకాలంలో జీతాలు రాకపోవడంతో బ్యాంకుల్లో వేలల్లో ఫైన్లు పడుతున్నాయి. ఇప్పుడు డీజిల్ ధర రూ. 75 అయింది. టికెట్ ధర పెంచితే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
-కమాల్ రెడ్డి, ఎన్‌ఎంయూ, అధ్యక్షుడు