V6 News

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం

నర్సంపేట, వెలుగు: ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తూజిపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఫ్యామిలీని ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకులు పరామర్శించారు. శంకర్ గౌడ్ ఫొటోకు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన 31 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని, ఒకే ఒక డిమాండ్​పై ఐఏఎస్ కమిటీలతో కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు.

కార్మికులు ఎవరూ అధైర్య పడద్దని, ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలు పరిష్కరించుకుందామని స్పష్టం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి తమవంతుగా ప్రతి కార్మికుడు రూ.200 నుంచి రూ.300 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ, బీసీ సంఘాల నాయకులు, నర్సంపేట జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.