సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి : పీవీ శ్రీనివాసరావు

సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి : పీవీ శ్రీనివాసరావు
  • సమాచార హక్కు చట్టం కమిషనర్​ పీవీ శ్రీనివాసరావు
  • డీఎంహెచ్​వో ఆఫీస్​ లో ఆకస్మిక తనిఖీ

ఖమ్మం, వెలుగు :  సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని ఆర్టీఐ కమిషనర్​ పీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా అధికారులు సమాచార హక్కు చట్టాన్ని తప్పనిసరిగా పాటిస్తూ పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. శనివారం ఖమ్మంలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ లోని డీఎంహెచ్​ఓ ఆఫీస్​ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఐ సంబంధిత రిజిస్టర్ లను, వచ్చిన దరఖాస్తులను, పంపిన సమాధానాలను పరిశీలించారు.

 జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు. గత రెండు సంవత్సరాల పాటు ఆర్టీఐ కమిషనర్ నియామకం కాకపోవడంతో 17 వేల కేసులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు అధికారుల్లో ఉన్న నిర్లిప్తత తొలగించాలనే ఉద్దేశ్యంతో జిల్లాల్లో పర్యటన చేపట్టామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, ఫోన్ నెంబర్ లతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. 

ఆర్టీఐ చట్టం ప్రకారం అవగాహనతో అమలు చేస్తే అక్రమాలు తగ్గిపోతాయని చెప్పారు. సంతాన సాఫల్య కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాల గురించి ఇటీవల వార్తలు వస్తున్నాయని, సమాచార హక్కు చట్టం ప్రకారం జిల్లాలో ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి, వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నిబంధనలు పాటిస్తున్నాయా లాంటి సమాచారం ప్రజలు తెలుసుకోవచ్చన్నారు. తర్వాత ఇందిరా నగర్​ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ  విద్యార్థులతో కలిసి మధ్యాహ్న  భోజనం చేశారు.