రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి : మోదీ

రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి :  మోదీ

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ ప్రజలందరినీ ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ సమయంలో దేశం సమష్టి బలం కనిపించిందని చెప్పారు. ఆదివారం మన్‌‌కీ బాత్‌‌లో ఆయన మాట్లాడారు. మన రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడి పాలనే స్ఫూర్తి అని, అందుకే జనవరి 22న ‘దేవుడి నుంచి దేశం’, ‘రామ్ నుంచి రాష్ట్ర’ గురించి తాను మాట్లాడానని చెప్పారు. ‘‘శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో అందరి భావం, అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు. ఎంతో మంది రాముడి భజనలు చేశారు.  ఆ రోజున రామ జ్యోతిని వెలిగించి ప్రజలు దీపావళి జరుపుకున్నారు. ఈ సమయంలో దేశం సామూహిక బలం కనిపించింది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే మన ప్రతిజ్ఞకు ఇదే ఆధారం” అని అన్నారు. మనందరి శక్తి దేశాన్ని ప్రగతిపథంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు.

ప్రజల ‘పద్మాలు’ 

ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల గురించి ప్రధాని ప్రస్తావించారు. అట్టడుగు స్థాయిలో పనిచేసి, పెను మార్పులకు కారణమైనా వెలుగులోకి రానివారిని సత్కరించామని అన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో పద్మ అవార్డుల విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రజల పద్మాలుగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. పద్మ అవార్డు గ్రహీతలు చేసిన పనులు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, రంగస్థలం, భజనల విషయంలో దేశానికి కీర్తిని తెచ్చారు” అని తెలిపారు. విదేశీయులను పద్మ అవార్డులతో సత్కరించామని వివరించారు. రిపబ్లిక్ డే పరేడ్‌‌లో మొత్తం 20 కంటింజెంట్స్‌‌ కవాతు చేయగా.. అందులో 11 విమెన్ కంటింజెంట్లు ఉన్నాయని ప్రధాని అన్నారు. శకటాలతోపాటు వచ్చిన ఆర్టిస్టులందరూ మహిళలేనని అన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌‌లో 1,500 మంది అమ్మాయిలు పాలుపంచుకున్నారని తెలిపారు. 21వ శతాబ్దపు భారతదేశం.. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ మంత్రంతో ముందుకు సాగుతున్నదని వెల్లడించారు. ఈ సారి 13 మంది మహిళా అథ్లెట్లకు అర్జున అవార్డులను అందజేసినట్లు తెలిపారు.