అక్రమ వెంచర్లకు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికార పార్టీ లీడర్లు

అక్రమ వెంచర్లకు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికార పార్టీ లీడర్లు
  • అధికార పార్టీ లీడర్ల అనధికార భూదందా
  • పార్టీషన్లకు నిరాకరించిన సబ్‌రిజిస్టార్‌తో గొడవ
  • ఆయన లీవ్‌లో ఉన్నప్పుడు ఇన్‌చార్జితో 39 రిజిస్ట్రేషన్స్
  • రూ.లక్షల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రాత్రికి రాత్రి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూలింగ్​ పార్టీ లీడర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి రూల్స్​కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎల్​ఆర్​ఎస్​, నాలా కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్లు లేని వెంచర్లలో నిబంధనలను పట్టించుకోకుండా పార్టీషన్లు చేశారు. సబ్​ రిజిస్ర్టార్​ లీవ్​లో ఉండగా.. ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్ మంగళవారం రాత్రి పది గంటల వరకు గుట్టుచప్పుడు ఈ వ్యవహారం నడిపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​, బీజేపీ, సీపీఐఎంఎల్​ న్యూడెమోక్రసీ లీడర్లు నిలదీయడంతో.. ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​ రిజిస్ర్టేషన్లు నిలిపివేసి వెళ్లిపోయారు. దీనిపై కలెక్టర్​తో పాటు సంబంధిత ఆఫీసర్లకు కంప్లైంట్​ చేసేందుకు ప్రతిపక్ష లీడర్లు సిద్ధమవుతున్నారు.

అంతా ప్లాన్​ ప్రకారమే... 
అధికార పార్టీకి చెందిన లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వరకు ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​తో రిజిస్ర్టేషన్లు చేయించినట్లు అపోజిషన్​ లీడర్లు ఆరోపిస్తున్నారు. గతంలో వీటి రిజిస్ర్టేషన్లపై రెగ్యులర్ సబ్ రిజిస్ర్టార్ ఇక్బాల్​కు, రూలింగ్​ పార్టీకి చెందిన రియల్టర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో పార్టీషన్లు చేస్తున్నారని, మీరు ఎందుకు చేయరని రియల్టర్లు సబ్ రిజిస్ర్టార్​ను నిలదీశారు. ఎంత ప్రెజర్​ చేసినా ఆయన వారికి లొంగలేదు. రూల్స్​కు అగెనెస్ట్​గా రిజిస్ర్టేషన్లు చేయనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆయన లీవ్​లో ఉండడంతో మంచిర్యాల సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీస్​లో జూనియర్​ అసిస్టెంట్​ రతన్​ ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​గా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు ఉత్కూర్​ శివారులోని 270ఏ, 272/ఏ1తో పాటు మరో నాలుగు సర్వే నంబర్లకు సంబంధించి అరవైకి పైగా డాక్యుమెంట్లను రెడీ చేశారు. రాత్రి పది గంటల వరకు అందులో 39 డాక్యుమెంట్లకు సంబంధించిన పార్టీషన్​ రిజిస్ర్టేషన్లు పూర్తి చేశారు. మరో 25 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్​ చేయడానికి సిద్దపడగా.. విషయం తెలుసుకున్న  ప్రతిపక్ష పార్టీల లీడర్లు వెళ్లి అడ్డుకున్నారు. గతంలో రోజుకు నాలుగైదు రిజిస్ర్టేషన్లు మాత్రమే జరిగేవి. కానీ ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​ ఆధ్వర్యంలో ఒకే రోజు ఏకంగా అరవై డాక్యుమెంట్లు సిద్ధం చేసి అందులో 39 రిజిస్ర్టేషన్లు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్టు, ఒక్కో డాక్యుమెంట్​కు రూ.15వేల చొప్పున వంద రిజిస్ర్టేషన్లు చేసేందుకు వారిమధ్య ఒప్పందం కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్లు లేని వెంచర్లకు పార్టీషన్లు చేయాలని లీడర్లు సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీస్​ చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపాలిటీగా అప్​గ్రేడ్ కాకముందు వెలిసిన వెంచర్లు కావడంతో రియల్టర్లు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. ఏడాదినుంచి ఎటూ తోచని స్థితిలో ఉన్నవాళ్లంతా ప్లాన్ ప్రకారం ఇన్​చార్జి సబ్​రిజిస్ట్రార్​తో పనిచేయించుకునేందుకు సిద్దపడ్డారు. 

రూల్స్​కు అగెనెస్ట్​గా చేయనని చెప్పా...
రూల్స్​కు అగెనెస్ట్​గా ఎలాంటి రిజిస్ర్టేషన్లు చేయనని చెప్పాను. ధరణిలో డాక్యుమెంట్​ టు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్​ చేయాలేతప్ప పార్టీషన్లు చేయడానికి పర్మిషన్​లేదు. అది కూడా ఎల్​ఆర్​ఎస్​ కట్టినవాటికే చేయాలి. మున్సిపల్​ యాక్ట్​కు వ్యతిరేకంగా ఉన్నవాటికి కాదు. నేను లీవ్​లో ఉన్నా. ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​ ఎట్ల చేశారో తెలియదు.
‑ ఇక్బాల్, సబ్ రిస్ట్రార్​, లక్షెట్టిపేట

డిస్ర్టిక్ట్​ రిజిస్ట్రార్​ ఆదేశాలతోనే చేశాను.. 
బుధవారం నుంచి లాక్​డౌన్​ ఉండడంతో డిస్ర్టిక్ట్​ రిజిస్ర్టార్​ ఆదేశాలతోనే మంగళవారం రాత్రి వరకు ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు చేశాను. నాలా కన్వర్షన్ లేకున్నా గజాల చొప్పున పార్టీషన్లు చేయమని జిల్లా రిజిస్ర్టార్​ చెప్పారు.  దీనికి సంబంధించిన ఆర్డర్​ కాపీ ఏమీ లేదు. 
- రతన్, ఇన్​చార్జి సబ్​ రిజిస్ట్రార్​, లక్సెట్టిపేట

అక్రమ రిజిస్ట్రేషన్లు క్యాన్సల్​ చేయాలి
రూలింగ్​ పార్టీకి చెందిన రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ర్టేషన్లు చేయడానికి వారికి  ఆఫీసర్లు పూర్తిగా సహకరించారు. ఇన్​చార్జి సబ్​ రిజిస్ర్టార్​ అత్యుత్సాహంతో రాత్రి పది గంటల వరకు రిజిస్ర్టేషన్లు చేశారంటేనే ఇందులో అక్రమాలు జరిగినట్టు అర్థమవుతోంది. దొంగచాటుగా జరిగిన 39 రిజిస్ర్టేషన్లను క్యాన్సల్​ చేయాలి. 
‑ ఆరిఫ్​, హరిగోపాల్, దొండ ప్రభాకర్, అపోజిషన్​ పార్టీల లీడర్లు