
- సిటీ రోడ్లపై 10 నుంచి 15 మిల్లీ మీటర్ల మందంతో ఏర్పాటు
- రూల్స్ప్రకారం ఉండాల్సింది 5 మిల్లీ మీటర్లే
- మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కొన్నిచోట్ల మాత్రమే చర్యలు
- ప్రమాదకరంగా ఉన్నచోట అలాగే వదిలేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని మెయిన్రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా వేసిన రంబుల్ స్ట్రిప్స్ ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల స్పీడ్‌బ్రేకర్లను తలపిస్తున్నాయి. వీటి మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు నడుం, వెన్ను నొప్పులతో హాస్పిటల్స్ పాలవుతున్నారు. ఈ విషయమై రెండు నెలల కిందట జనం మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేయగా రంబుల్‌స్ట్రిప్స్ తో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో కొత్తగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ అప్పటికే ఉన్నవాటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట ఎత్తు తగ్గించి వదిలేశారు. మిగిలిన చోట్ల అంతే ఉన్నాయి. దీంతో జనం మళ్లీ మంత్రి కేటీఆర్‌తో పాటు మేయర్, జీహెచ్ఎంసీ ట్విట్టర్ అకౌంట్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. టూవీలర్లు స్కిడ్అవుతున్నాయని, కార్ల సస్పెన్షన్లు ఖరాబ్అవుతున్నాయని వాపోతున్నారు.
వేగాన్ని తగ్గించాలి.. కానీ
వెహికల్స్వేగాన్ని తగ్గించేందుకు వేయాల్సిన రంబుల్ స్ట్రిప్స్ ను సిటీలోని పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా, అత్యధిక మందంతో వేశారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) నిబంధనల ప్రకారం.. రంబుల్ స్ట్రిప్స్ మందం 5 మిల్లీ మీటర్లు, 200 మిల్లీ మీటర్ల వెడల్పులో ఉండాలి. దాని మధ్య తగిన గ్యాప్ మెయింటెన్చేస్తూ ఆరు స్ట్రిప్ లు పక్కపక్కన వేయాలి. కానీ నగరంలో కొన్ని చోట్ల 10 నుంచి15 మిల్లీ మీటర్ల మందంతో లెక్కలేకుండా వేశారు. వీటి మీదుగా వెళ్తున్న వాహనదారులు నడుము, మెడ, తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. జనం నుంచి ఫిర్యాదులు పెరగడంతో మంత్రి కేటీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ఈఎస్సీలను ఆదేశించారు. అయితే అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ ప్రాంతాల్లోనే..
నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, జేఎన్ టీయూ, లంగర్ హౌస్, పఠాన్ చెరు, ఫలక్ నుమా, కూకట్ పల్లి ఏరియాల్లోని రోడ్లపై ఏర్పాటు వేసిన రంబుల్ స్ట్రిప్స్ అత్యంత ప్రమాదకరంగా మారాయి. వెహికల్స్‌లో చేసినా, కుదుపులు తప్పడం లేదు. ఎల్బీనగర్లో టూవీలర్స్‌పై జర్నీ చేసేవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగే కొన్ని ఫ్లైఓవర్లపై రంబుల్‌స్ట్రిప్స్ దారుణంగా ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లని తలపిస్తున్నాయి. వీటిని దాటే టైంలో కార్లు సైడ్ కు వెళ్తున్నాయి. టర్నింగ్‌లు, జంక్షన్లు, యూ టర్న్ ల సమీపంలో మాత్రమే రంబుల్ స్ట్రిప్స్వేయాల్సి ఉన్నప్పటికీ.. సిటీ రోడ్లపై ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా వేస్తున్నారు. వీటి మీదుగా వెళ్లే టైంలో గర్భిణులు, వృద్ధులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూడేండ్ల కిందట బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కారు పడిపోవడంతో ఓ మహిళ చనిపోయింది. ఫ్లైఓవర్ ను ఓపెన్ చేసిన కొన్నాళ్లకే ఈ ప్రమాదం జరగడంతో ప్రభుత్వం సిటీ మొత్తం చర్యలు తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు, ఫ్లైఓవర్లపై రంబుల్ స్ట్రిప్స్వేయించారు. అయితే ఎక్కడా రూల్స్పాటించకపోవడంతో వాహనదారులకు తలనొప్పిగా మారాయి.