
సెక్యూరిటీ ఏజెన్సీల అధికారుల వెల్లడి
మే 3న ఇంఫాల్‌లో దొరికిన డెడ్‌బాడీ ఢిల్లీ మహిళది
అది మైతీ వర్గం మహిళదన్న పుకార్లతో చెలరేగిన అల్లర్లు
మే 4న కుకీ మహిళల ఊరేగింపు
లోకల్ చానల్స్, పత్రికల కథనాలతోనూ పెరిగిన హింస
ఇంఫాల్: మణిపూర్ లో రెండు నెలల కింద మొదలైన హింసకు రూమర్లు, ఫేక్ న్యూసే ఆజ్యం పోశాయని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలు సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. ఫేక్ న్యూస్ కారణంగానే మొదట అల్లర్లు చెలరేగాయని వారు స్పష్టం చేశారు. మైతీ వర్గం మహిళను రేప్ చేశారంటూ ఓ ఫేక్ ఫొటో ప్రచారంలోకి రావడంతో ఆ వర్గం జనం రెచ్చిపోయారని, మే 4న ఇద్దరు కుకీ మహిళలపై దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. ‘‘మే 3వ తేదీన పాలిథిన్ కవర్లో చుట్టి ఉన్న ఓ మహిళ డెడ్‌బాడీ ఇంఫాల్ లోయలో దొరికింది. దీన్ని అన్ని లోకల్ చానల్స్ ప్రసారం చేశాయి. చురాచాంద్‌పూర్‌లో మైతీ వర్గానికి చెందిన మహిళను కుకీ తెగకు చెందిన కొందరు రేప్ చేసి, హత్య చేశారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. డెడ్‌బాడీని కవర్లో చుట్టి ఇంఫాల్ లోయలో పడేశారని పుకార్లు పుట్టించారు. దీంతో ఆగ్రహించిన మైతీ వర్గానికి చెందిన యువకులు కుకీలపై దాడికి దిగారు. కుకీ మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు” అని అధికారులు తెలిపారు. వాస్తవానికి ఆ డెడ్ బాడీ ఢిల్లీలో హత్యకు గురైన మహిళదిగా స్పష్టం చేశారు.
మయన్మార్ లో జరిగితే మణిపూర్‌లో అంటూ..
కొందరు గిరిజనులు మతపరమైన స్థలాన్ని తగులబెడుతున్నట్లు వార్తలు స్ప్రెడ్ చేయగా, సంబంధిత వర్గం వాళ్లను అక్కడికి తీసుకెళ్లి చూపించి.. ఫేక్ అని పోలీసులు తేల్చారు. ‘‘కొందరి డెడ్‌బాడీలు నేలపై పడి ఉన్నాయి. ఓ మహిళ మృతదేహం కూడా ఉంది. గిరిజనులే మహిళను నరికేశారంటూ 26 సెకన్ల వీడియో స్ప్రెడ్ చేశారు. కానీ, ఆ వీడియో గతేడాది మయన్మార్‌లోని టమూ పట్టణంలో హత్యకు గురైన మహిళది”అని అధికారులు తెలిపారు. అలాగే అరుణాచల్ లో ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురవుతున్న వీడియోను కూడా.. ఇంఫాల్‌లో జరిగిందని కొందరు న్యూస్ స్ప్రెడ్ చేశారన్నారు. మణిపూర్ లోకల్ చానల్స్, న్యూస్ పేపర్లు కూడా అల్లర్లకు ఆజ్యం పోశాయని మే 3 నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఏకపక్ష వార్తలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాయని వివరించారు.
మిజోరం నుంచి అస్సాంకు 41 మంది మైతీలు
మణిపూర్ కు చెందిన మైతీ వర్గం వాళ్లు మిజోరం నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే దాడులు జరుగుతాయన్న మాజీ మిలిటెంట్ గ్రూపుల హెచ్చరికల నేపథ్యంలో అక్కడి నుంచి మైతీలు బయలుదేరుతున్నారు. ఆదివారం మిజోరం నుంచి 41 మంది మణిపురి మైతీలు అస్సాం చేరుకున్నారు. మరోవైపు మిజోరం నుంచి మైతీలను తిరిగి తీసుకొచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్లు పంపాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, మహిళలను నగ్నంగా తిప్పిన ఘటనపై యూపీ, గుజరాత్, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు, మైనార్టీ వర్గాలు ఆదివారం కూడా నిరసనలు తెలిపాయి.
బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసేదాకా ఆ రాష్ట్రంలో అల్లర్లు ఆగవని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో దారుణమైన ఘటన బయటికి వస్తున్నదని కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. రేప్ చేయడం అమానవీయమని పౌర హక్కుల కార్యకర్త ఇరోమ్ చాను షర్మిల కూడా మండిపడ్డారు. మోదీ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టాలని, సీఎం బీరెన్ సింగ్ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు సహాయం చేసేందుకు, అండగా నిలిచేందుకు మణిపూర్ వచ్చానని, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రావాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా కోరారు.