రూపాయి రికార్డు పతనం: డాలర్‌తో పోలిస్తే 91.50 వద్ద ఆల్‌టైమ్ లో

రూపాయి రికార్డు పతనం: డాలర్‌తో పోలిస్తే 91.50 వద్ద ఆల్‌టైమ్ లో

జనవరి 21 బుధవారం ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 91.50 మార్కును తాకి కొత్త రికార్డు పతనాన్ని నమోదు చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో నమోదైన 91.07 రికార్డును ఇది నేడు అధిగమించింది. 2025లో ఇప్పటివరకు రూపాయి సుమారు 5 శాతం మేర క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడికి అద్దం పడుతోంది.

పతనానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ముందుగా అంతర్జాతీయంగా 'గ్రీన్‌ల్యాండ్' అంశం చుట్టూ నెలకొన్న భౌగోళిక అనిశ్చితి వల్ల ఫారెన్ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని సురక్షితమైన డాలర్ వైపు మళ్లుతున్నారు. కేవలం ఈ జనవరి నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగానే ఉన్నప్పటికీ.. ఫారెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా తరలిపోతుండటమే రూపాయిని బలహీనపరుస్తోంది. అలాగే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత లేకపోవడం కూడా రూపాయిని షేక్ చేస్తున్న కీలక కారణాల్లో ఒకటిగా ఉంది. 

రూపాయి పతనం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై.. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి.. ఇది పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు దారితీస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఫీజులు, అక్కడి నివాస ఖర్చులు భారమవుతాయి. అలాగే విదేశీ పర్యటనలు ప్లాన్ చేసే వారికి అదనపు భారం తప్పదు. చివరిగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడిభాగాల దిగుమతి ఖర్చు పెరగి వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో అస్థిరతను తగ్గించేందుకు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.