
నాగర్ కర్నూల్, వెలుగు : తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్..వైన్ షాప్ లైసెన్సుల కోసం అప్లై చేయడానికి15 రోజులు టైం ఇచ్చి, గృహలక్ష్మి పథకానికి మాత్రం 3 రోజులు గడువు ఇవ్వడం నీచమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ నిరుపేద మహిళలు మండల ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గృహలక్ష్మి అప్లికిషన్స్ కు 15 రోజుల టైమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గద్దర్ బతికున్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించిన కేసీఆర్.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించడం పెద్ద జోక్ గా అభివర్ణించారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో జలవనరుల నిపుణుడు విద్యాసాగర్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వాలని ప్రొఫెసర్జయశంకర్ కోరితే సరే అని మాట ఇచ్చిన కేసీఆర్అల్లుడు హరీశ్‌రావుకు అప్పగించాడని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్ముతున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లో చేరడానికి కారణాలను ప్రజలకు బహిరంగ లేఖ ద్వారా వివరిస్తానని చెప్పారు.