కొత్త బిల్డింగ్స్​ కట్టినా.. పాత గదుల్లోనే పాఠాలు!

కొత్త బిల్డింగ్స్​ కట్టినా.. పాత గదుల్లోనే పాఠాలు!
  • పట్టించుకోని ఆఫీసర్లు.. స్టూడెంట్స్​కు తప్పని తిప్పలు 
  • రూర్బన్ స్కీం కింద రూ.2 కోట్లతో అదనపు గదుల నిర్మాణం
  • బిల్లులు రాక హ్యాండోవర్ చేయని కాంట్రాక్టర్లు
  • దిక్కులేని సమస్యల మధ్యే కొనసాగుతున్న చదువులు

మెదక్​ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఆయా స్కూళ్లలో కోట్ల రూపాయలు పెట్టి కొత్త బిల్డింగ్​లు కట్టినా పాఠాలు మాత్రం పాత గదుల్లోనే కొనసాగుతున్నాయి. శ్యాం ప్రసాద్ రూర్బన్ మిషన్​ స్కీమ్ కింద అదనపు గదులు నిర్మించినా వాటి బిల్లులు పెండింగ్​లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆఫీసర్లకు హ్యాండోవర్​ చేయలేదు. ఫలితంగా పాత సమస్యల మధ్యే చదువులు కొనసాగుతున్నాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో స్టూడెంట్స్​కు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్, పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, లింగాయిపల్లి చీకొడ్, పాపన్నపేట గ్రామాల్లోని జిల్లా పరిషత్​ హైస్కూల్​ బిల్డింగ్ లు శిథిలావస్థకు చేరాయి. వర్షం పడితే ఉరుస్తున్నాయి. ఈ హైస్కూళ్లలో ఇంగ్లీష్, తెలుగు మీడియంలో కలిపి 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నవారి సంఖ్య చూస్తే పాపన్నపేటలో 597 మంది, కుర్తివాడలో 240 మంది, లింగాయపల్లి చీకోడ్​ లో 397 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్​కు సరిపడ తరగతి గదులు లేకపోవడంతోపాటు ఉన్న బిల్డింగ్స్​ అధ్వానంగా మారాయి. ఈ నేపథ్యంలో శ్యాంప్రసాద్ రూర్బన్ మిషన్​ స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో స్కూళ్లకు అడిషనల్​క్లాస్​ రూమ్స్​ నిర్మాణానికి ఫండ్స్​ శాంక్షన్​ అయ్యాయి. కుర్తివాడలో ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున మూడు అదనపు తరగతి గదులు, రూ.35 లక్షలతో రెండు అదనపు గదులు, సైన్స్​ ల్యాబ్, టాయిలెట్స్​ శాంక్షన్​ అయ్యాయి. వీటిలో ఐదు క్లాస్​ రూమ్​లు, సైన్స్​ ల్యాబ్​ నిర్మాణం పూర్తి అయ్యింది. స్థలం సమస్య కారణంగా నాలుగు టాయిటెట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.  లింగాయిపల్లి చీకోడ్​ జడ్పీ హైస్కూల్​కోసం ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున మూడు క్లాస్​రూమ్స్, రూ.21 లక్షలతో ఒక క్లాస్ రూమ్​బిల్డింగ్, సైన్స్​ల్యాబ్, రెండు టాయిలెట్లు శాంక్షన్​ అయ్యాయి. వీటిలో రెండు క్లాస్​రూమ్స్​ పూర్తయ్యాయి. సైన్స్​ల్యాబ్​ బిల్డింగ్​రూఫ్ లెవల్​వరకు పూర్తయింది. పాపన్నపేట జడ్పీ హైస్కూల్​ కోసం ఒక్కోక్కటి రూ.10 లక్షల చొప్పున నాలుగు అడిషనల్​క్లాస్​ రూమ్స్, రూ.47 లక్షలతో నాలుగు అడిషనల్ క్లాస్​ రూమ్స్, సైన్స్​ల్యాబ్​ బిల్డింగ్ శాంక్షన్​అయ్యింది. అన్ని క్లాస్​రూమ్ బిల్డింగ్​ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొంత మేర ఫ్లోరింగ్, పేయింటింగ్​ పని పెండింగ్ లో ఉంది. 

బిల్లులు రాకపోవడంతో.. 
రూర్బన్​స్కీం కింద బిల్డింగ్​లు నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తి స్థాయిలో పేమెంట్ కాకపోవడంతో వారు వాటిని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​కు హ్యాండోవర్ చేయలేదు. మూడు చోట్ల దాదాపు ఏడాది కాలంగా ఇదే పరిస్థితి ఉంది. స్టూడెంట్స్, టీచర్స్​ఇబ్బందులు పడుతున్నా ఈ బిల్డింగ్​ల పెండింగ్​బిల్లులు రిలీజ్​చేయించి, వాటిని వినియోగంలోకి తేవడంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా బిల్లులు రిలీజ్​చేయించి అదనపు గదులను స్టూడెంట్స్ కు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. 

కొత్త బిల్డింగ్​ ఓపెన్ ​చేయాలి
కొత్త బిల్డింగ్ ​కట్టడంతో మా ఇబ్బందులు పోతాయనుకున్నాం. కానీ పాత బిల్డింగ్​లోనే క్లాస్​లు నిర్వహిస్తున్నారు. వర్షాలకు ఉరుస్తున్నాయి. వెంటనే కొత్త బిల్డింగ్స్​ఓపెన్ చేయించాలి. 
- ఉజెర్, టెన్త్​ క్లాస్​స్టూడెంట్, జడ్పీహెచ్​ఎస్, పాపన్నపేట

త్వరలో ప్రారంభిస్తాం.. 
మూడు గ్రామాల్లోని  హైస్కూళ్లలో రూర్బన్​ స్కీం కింద అదనపు గదులు, సైన్స్ ల్యాబ్స్​నిర్మించాం. పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో వీటిని వినియోగంలోకి తీసుకొస్తాం. 
- గోపాల్, పంచాయతీరాజ్​ ఏఈ, పాపన్నపేట