హైదరాబాద్, వెలుగు:రుసాన్ ఫార్మా సంస్థ పార్కిన్సన్స్ వ్యాధి గ్రస్తుల కోసం అపోసాన్– 3 పెన్ ను విడుదల చేసింది. భారతదేశంలోనే మొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు. పార్కిన్సన్స్ రోగుల్లో కనిపించే ఆన్-ఆఫ్ ఎపిసోడ్స్ చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మల్టీ-డోస్ పెన్ ద్వారా రోగులు తమ మోతాదును కచ్చితంగా తీసుకోవచ్చు. ఇందులో డయల్- ఎ- డోస్ మెకానిజం ఉండటం వల్ల వాడటం సులువు. రోగులు తమ ఇంట్లోనే స్వయంగా ఇంజెక్షన్ చేసుకోవచ్చు. 2018 నుంచే కంపెనీ అపోమార్ఫిన్ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు పెన్ రూపంలో తీసుకొచ్చింది.
పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడులోని నరాల కణాలు దెబ్బతినడం వల్ల కలిగే దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ వ్యాధి. ఇది మెదడులో డోపమైన్ (dopamine) అనే రసాయన స్థాయిలు తగ్గడం వల్ల వస్తుంది. చేతులు వణకడం, కదలికలలో నెమ్మదనం (bradykinesia), కండరాల బిగుతు, నడకలో ఇబ్బందులు వంటివి ముఖ్య లక్షణాలు. ఇది సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది.
