
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి వందలాది డ్రోన్లను కీవ్ పైకి ప్రయోగించింది. దీంతో ఓ మహిళ మృతి చెందిందని స్థానిక అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకడానికి ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ భారీ దాడులు చోటుచేసుకున్నాయి.
కీవ్, డ్నిప్రోపెట్రోవ్స్క్, డొనెట్స్క్ తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు తెగబడిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిందని చెప్పింది. వీటిలో 88 డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటని వెల్లడించింది.