అమెరికా ఆంక్షలు విధించినా తట్టుకుని నిలబడ్తం

అమెరికా ఆంక్షలు విధించినా తట్టుకుని నిలబడ్తం

మాస్కో: ఉక్రెయిన్ వివాదంపై తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని బుధవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అయితే, తమ దేశ భద్రత, ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి బేరసారాలకు తావులేదని స్పష్టం చేశారు. అన్ని దేశాలకూ సమానమైన సెక్యూరిటీ ఉండేలా ఒక సిస్టంను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా క్లిష్టమైన సమస్యలకు దౌత్యపరంగా పరిష్కారాల కోసం నిజాయతీగా చర్చలు జరిపేందుకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.  కాగా, ఉక్రెయిన్ వివాదంపై ఇండియా తీసుకున్న  ‘ఇండిపెండెంట్’ స్టాండ్ ను రష్యా స్వాగతించింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉక్రెయిన్ అంశంపై ఎటూ మొగ్గకుండా ఉండటం ద్వారా ఇండియా తమతో ఉన్న ప్రత్యేక పార్ట్ నర్షిప్ ను తెలియజేసిందని 
మెచ్చుకుంది.

తట్టుకుని నిలబడ్తం: రష్యా ఫైనాన్స్​ మినిస్ట్రీ
అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినా, తమ ఎకానమీ, డెట్ మార్కెట్‌‌లు స్టేబుల్ గా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని బుధవారం రష్యన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. తమ వద్ద 4.5 ట్రిలియన్ రూబుల్స్ (56 బిలియన్ డాలర్లు) ఉన్నాయని, గవర్నమెంట్ డెట్ బాండ్లను అమ్మేందుకు, కొత్త అప్పులు తీసుకునేందుకు ఇబ్బందేమీ లేదని వెల్లడించింది. అలాగే దేశంలోని బ్యాంకులకు రష్యన్ సెంట్రల్ బ్యాంకు సడలింపులు ఇస్తోందని, ఫిబ్రవరి 18 నాటి ఎక్చేంజ్ రేట్ ఆధారంగా షేర్లు, బాండ్ల అమ్మకాలకు అనుమతిస్తోందని తెలిపింది. మరోవైపు అమెరికా ఆంక్షలను తట్టుకుని ఎలా నిలబడాలో తమకు తెలుసని యూఎస్ లో రష్యన్ అంబాసిడర్ అనటోలీ ఆంటనోవ్ అన్నారు. రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల గ్లోబల్ మార్కెట్లకు నష్టం వాటిల్లుతుందని, ధరలు భారీగా పెరిగి సాధారణ అమెరికన్ ప్రజలపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.