రష్యా గుప్పెట్లోకి మరో సిటీ

రష్యా గుప్పెట్లోకి మరో సిటీ

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా మూడో రోజూ తన దాడిని కొనసాగిస్తోంది. ఇప్పటికే దాదాపు పదికి పైగా సిటీలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న రష్యన్ బలగాల.. తాజాగా మరో సిటీపై పట్టు సాధించాయి.   ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ సిటీని ఆక్రమించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఎయిర్, షిప్ బేస్డ్ మిస్సైల్స్ తో దాడులు చేసి ఉక్రెయిన్ లోని మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 

మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ బలగాలు, ఉక్రెయిన్ ఆర్మీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రష్యా నుంచి తమ దేశ రాజధాని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు పట్టారు. కీవ్ సిటీలోని కొన్ని ఏరియాల్లో రష్యా యుద్ధ ట్యాంకులకు సిటిజన్లు నిప్పుపెట్టారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపుతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకొస్తున్నారు. యుద్ధ అనుభవం ఉన్న 18 వేల మందికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయుధాలు చేతపట్టి రణ రంగంలోకి దిగారు. మరో వైపు ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా సైనికుల మధ్యనే ఉంటూ యుద్ధాన్ని నడిపిస్తున్నారు. కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఆఫర్ ఇచ్చినా.. తాను దేశం వదిలి బయటకు రానని స్పష్టం చేశారు. ఆయుధాలు విడిచి పెట్టబోమని, ప్రాణం ఉన్నంత వరకు దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ సమయంలో తనకు పారిపోయేందుకు ఫ్లైట్ అక్కర్లేదని, ఆయుధాలు అందించాలని చెప్పారు.