రష్యా-ఉక్రెయిన్​ వార్ తో ప్రపంచానికి కొత్త సవాళ్లు : ఆర్​బీఐ గవర్నర్​

రష్యా-ఉక్రెయిన్​ వార్ తో ప్రపంచానికి కొత్త సవాళ్లు : ఆర్​బీఐ గవర్నర్​

హైదరాబాద్​, వెలుగు: రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ప్రపంచానికి కొత్త సవాళ్లను తెచ్చిందని రిజర్వ్​ బ్యాంక్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. కరోనా మూడో వేవ్​ సాగుతున్నప్పటికీ, ఎకానమీ  రికవరవుతున్న టైములో  వచ్చిన ఈ యుద్ధం పెద్ద దెబ్బే తీసిందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ప్రపంచాన్ని ఆహార సంక్షోభంలోకి నెట్టేసిందని చెప్పారు. హైదరాబాద్​లో శనివారం జరిగిన  డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎకనమిక్​ అండ్​ పాలసీ రీసెర్చ్​ (ఆర్​బీఐ) యాన్యువల్​ రీసెర్చ్​ కాన్ఫరెన్స్​లో శక్తికాంత దాస్​ పాల్గొన్నారు. కరోనా సంక్షోభం వల్ల బిగ్​ డేటా పవర్​ తెలుసుకోవడం వీలయిందని, అలాగే వర్క్​ ఫ్రం హోమ్​ ఎలా ఉంటుందో తెలిసిందని దాస్​ అన్నారు. కొవిడ్​–19 క్రైసిస్​ ఎన్నో కొత్త అంశాలపై రీసెర్చ్​కి దారితీసిందని, డిమాండ్​–సప్లయ్​ షాక్స్​, పాలసీ స్టిమ్యులస్​ ఎలా ఉండాలనే వాటిపై రీసెర్చ్​ అవసరమైందని ఆయన పేర్కొన్నారు.  

కీలకమైన సప్లయ్​ల కోసం ఒక్కరి మీదనే ఆధారపడకూడదనే విషయాన్ని రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం అనుభవంలోకి తెచ్చిందని చెప్పారు. ఒక్కరి కంటే ఎక్కువ సప్లయర్స్​నే అట్టి పెట్టుకోవాలని అర్ధమైందన్నారు. కమొడిటీల రేట్లు చుక్కలంటాయని, సప్లయ్​ చెయిన్లు సవాళ్లు తెచ్చాయని దాస్​ చెప్పారు. ఫలితంగా గ్లోబల్​గా ఇన్​ఫ్లేషన్​ భారీగా పెరిగిందని, పాలసీ మేకర్లకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మార్చి 2020 తర్వాత ఎకనమిక్​ రీసెర్చర్లకు మూడు సవాళ్లు వచ్చాయని, ఒకటి కొవిడ్​ –19 అయితే, రెండోది రష్యా–ఉక్రెయిన్​ యుద్ధమని, ఇక మూడో సవాలు చాలా దేశాలు తమ మానిటరీ పాలసీలను టైట్​ చేయడమని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు. ఈ మూడు షాక్​ల ఎఫెక్ట్​లు ఇంకా కనబడుతూనే ఉన్నాయని, జాగ్రత్తగానే గమనించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్​బీఐ రీసెర్చ్​ డిపార్ట్​మెంట్​ చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందన్నారు.