రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పేద దేశాలకు ఆకలి మిగల్చొద్దు : జుర్రు నారాయణ యాదవ్

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం పేద దేశాలకు ఆకలి మిగల్చొద్దు : జుర్రు నారాయణ యాదవ్

రష్యా – ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరిహద్దు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, వైద్య, ఆర్థిక, సాంకేతిక, వ్యవసాయ, ఆహార రంగాలపై పడుతున్నది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఉక్రెయిన్  ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్ కు 45 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు, రాప్ సీడ్, సోయా, ఎరువులను ఎగుమతి చేస్తున్నది. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న గోధుమల్లో ఉక్రెయిన్, రష్యాల వాటా 30 శాతం, మొక్కజొన్నలో 20 శాతం, పొద్దుతిరుగుడు నూనెలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రష్యా ఒక్కటే ప్రపంచ ఎగుమతుల్లో15 శాతం వాటా కలిగి ఉన్నది. ఫిబ్రవరిలో రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభంమైనప్పట్టి నుంచి ఆహార ధాన్యాల సప్లయ్​కి అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచంలో చాలా దేశాల్లో ఆహార సంక్షోభానికి దారి తీసింది. యూరప్ ఖండంతో పాటు లాటిన్ అమెరికాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య, ఆసియాలోని పేద దేశాల్లో గోధుమలు తదితర ఆహార ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం ఏర్పడి ఆ దేశాల్లో తీవ్ర ఆహార సంక్షోభ పరిస్థితిని సృష్టించింది. సుమారు10 కోట్ల మంది జనాభాకు తినేందుకు తిండి లేక, వారి ఆహార భద్రత ప్రమాదంలో పడింది. అయితే ఈ సమస్య నుంచి పేద దేశాలను కాపాడడానికి, ఆహార భద్రత కల్పించడానికి  ఐక్యరాజ్యసమితి చొరవతో టర్కీ మధ్యవర్తిత్వంలో ఆహార ధాన్యాల నిరంతర సరఫరా కోసం నల్ల సముద్రంపై ఆహార ధాన్యాల ఎగుమతులకు రష్యా– ఉక్రెయిన్ ల మధ్య జులైలో ఆహార ధాన్యాల  ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఉక్రెయిన్ లోని ఒడెస్సా,చేరినోమోర్స్క్, యూజహనీ పోర్టుల నుంచి ఆహార ధాన్యాలు నల్లసముద్రం ద్వారా టర్కీ మీదుగా వివిధ దేశాలకు సరఫరా అవుతుంటాయి. ఈ ఒప్పందం వల్ల సరఫరా గొలుసు తిరిగి తెరుచుకొని ఆఫ్రికా, ఆసియాలోని పేద దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా అవుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు నియంత్రించగలిగి ఆహార సంబంధ ద్రవ్యోల్బణం ఇంకా పెరగకుండా చూడటం సాధ్యమైంది. ఈ ఒప్పందం తర్వాత 397 నౌకల్లో 9.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఎగుమతి అయ్యాయి. ఆహార ధరలు మార్చిలో గరిష్ట స్థాయి నుంచి15 శాతం తగ్గాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా లాంటి ఆహార కొరత ఉన్న దేశాల్లో సమస్య తీవ్రతరం కాకుండా ఈ ఒప్పందం ఉపకరించింది.

అసలు సమస్య..

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ ఆహార సంక్షోభ పరిస్థితికి పరిష్కారం దొరికిందని బాధిత దేశాలు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఇటీవల క్రిమియా సమీపం నల్లసముద్రంలోని సేవాస్టోపోల్ నౌక కేంద్రంలోని నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆగ్రహించిన రష్యా నల్లసముద్రం ద్వారా జరిగే ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. వాస్తవంగా ఈ ఒప్పందం నవంబర్19తో ముగియనుంది. దీంతో ఇప్పటికే రవాణాకు సిద్ధంగా ఉన్న రెండు వందల పైచిలుకు ఓడలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రష్యా ఒప్పందం నుంచి వైదొలుగుతుందని ప్రకటించిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో ఆహారధాన్యాల ధరలు ఐదు శాతం వరకు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో ఆహార సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇథియోఫియా, సోమాలియా, కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలకు, ఆసియా ఖండాలలోని పేద దేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభ పరిస్థితి తీవ్రంగా మారనుంది. దీంతో ఆసియా మార్కెట్లో కీలకమైన చమురు ధరలు కూడా పెరగనున్నాయి. ఐరోపా దేశాల్లో ఈ సంవత్సరం వేసవిలో హీట్ వేవ్స్ వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తులు బాగా పడిపోయాయి. ఈ ఒప్పందం నుంచి రష్యా తప్పుకోవడం వల్ల ఐరోపా దేశాల్లో కూడా దాని ప్రభావం కచ్చితంగా పడే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఎగుమతి చేసిన ధాన్యంలో ఎక్కువ భాగం ప్రపంచంలోని ఆకలితో ఉన్న దేశాలకు కాకుండా ఐరోపా దేశాలకు సరఫరా అవుతున్నదని ఆరోపించారు. కానీ యూఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్​మెంట్ వారు విడుదల చేసిన నివేదిక ఈ ఒప్పందం ద్వారా ఎగుమతి అవుతున్న ఆహార ధాన్యాల్లో ఎక్కువగా పేద దేశాలకే సరఫరా అయినట్లు తేలింది. ఎగుమతి చేసిన గోధుమల్లో కేవలం 20 శాతం మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలకు సరఫరా అయినట్లు ఆ రిపోర్టు పేర్కొంది. యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నుంచి ఉపశమనం పొందుతున్న దేశాలకు ఒక లక్ష తొంభైవేల టన్నుల గోధుమలు పంపడంతో పాటు ఆఫ్రికా,  ఆసియా దేశాలకు ఐదు మిలియన్ టన్నులకు పైగా ఎగుమతి చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంటున్నది.

చర్చల ద్వారానే పరిష్కారం

ఆహార సరఫరా ఒప్పందం నిలిపివేయడం వల్ల దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతామండలి సమావేశంలో భారత దౌత్యవేత్త మాట్లాడుతూ.. ఈ చర్య ఇంధన, ఎరువుల సరఫరా లాంటి  ప్రస్తుత సమస్యలను మరింత దిగజార్చుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని, చర్చల ద్వారా సంఘర్షణలకు పరిష్కారం వెతకాలని సూచించారు.  ఒప్పందం నుంచి రష్యా వైదొలిగిన తర్వాత భద్రతామండలి, అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో రష్యా రక్షణ మంత్రి, అంకారాలోని ఉక్రెయిన్ రక్షణ మంత్రి మధ్య జరిగిన చర్చల అనంతరం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పందిస్తూ.. రష్యా ఒప్పందంలో కొనసాగనున్నుట్లు వెల్లడించారు. ఇంతకు ముందు లాగే ధాన్యం రవాణా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఆ కొద్దిసేపటి తర్వాత రష్యా వార్తా సంస్థలు కూడా ఆయన వ్యాఖ్యలను ధ్రువీకరించాయి. సేఫ్ కారిడార్, ఉక్రెయిన్ పోర్టులు రష్యాకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలను నిర్వహించబోవని అని కీవ్ నుంచి రష్యాకు రాతపూర్వక హామీలు లభించాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ చెప్పారు. ఆ హామీలు ప్రస్తుతానికి సరిపోతాయని రష్యా భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఆహార భద్రత లాంటి అంశాల్లో ఆ ప్రభావం పేద దేశాలుపై తీవ్రంగా ఉంటున్నది. రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పేద దేశాలకు శాపంగా మారకూడదు. ప్రపంచ దేశాలు సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆహార భద్రత ఒక్కటి. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం అవసరం. ఐక్యరాజ్య సమితి అందుకు కృషి చేయాలి.

- జుర్రు నారాయణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు, టీటీయూ మహబూబ్​నగర్​