తనపై పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన రష్యా.. వీటో అంటే ఏంటి?

తనపై పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన రష్యా.. వీటో అంటే ఏంటి?

న్యూయార్క్: ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన రష్యా తీరును ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ ఎస్ సీ) తీర్మానం చేసింది. వెంటనే సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు అమెరికా, అల్బేనియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఆమోదం తెలిపింది. అయితే దాన్ని రష్యా తన వీటో అధికారం వినియోగించి అడ్డుకుంది. ‘‘రష్యా తన సైనిక బలగాలను వెంటనే పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి” అని తీర్మానంలో అమెరికా, అల్బేనియా డిమాండ్ చేశాయి. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం ఓటింగ్ జరిగింది. యూఎన్ ఎస్సీలో 15 దేశాలుండగా, 11 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. ఇందులో అల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గాబాన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఇండియా, చైనా, యూఏఈ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

చర్చలతోనే పరిష్కారం: ఇండియా 

వివాదాల పరిష్కారానికి చర్చలే సమాధానమని యూఎన్ లో ఇండియా ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంతో తమ దేశం ఆందోళన చెందుతోందని, తమ స్టూడెంట్ల భద్రతపై ఆవేదన చెందుతోందని చెప్పారు. మనుషుల ప్రాణాలను పణంగా పెడితే, సమస్యకు పరిష్కారం ఎప్పటికీ దొరకదన్నారు. హింసను ఆపేందుకు ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గం. దౌత్య మార్గాలను విస్మరించడం విచారకరం. తిరిగి వాటిని ప్రారంభించాలి. ఈ కారణాలతోనే తీర్మానంపై ఓటింగ్​కు దూరంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు. 

మా గళాన్ని ఆపలేరు: అమెరికా 

రష్యా తీర్మానాన్ని ఆపినంత మాత్రాన తమ గళాన్ని ఆపలేదని యూఎన్​లో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ అన్నారు. ‘‘మీరు (రష్యా) ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు. కానీ మా గొంతును వీటో చేయలేరు. సత్యాన్ని వీటో చేయలేరు. మా సిద్ధాంతాలను వీటో చేయలేరు. ఉక్రెయిన్ ప్రజలను వీటో చేయలేరు” అని అన్నారు. కాగా, తూర్పు ఉక్రెయిన్​లోని ప్రజల కోసమే కొట్లాడుతున్నామని రష్యా అంబాసిడర్ అన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చైనా అంబాసిడర్ ఝాంగ్ జున్ అన్నారు.  రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల చర్చలకు ఆస్కారం లేకుండాపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏంటీ వీటో పవర్​? 

యూఎన్ఎస్సీలో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా శాశ్వత సభ్య దేశాలు. అందుకే వీటికి ప్రత్యేక అధికారం ఉంది. అదే వీటో పవర్. కౌన్సిల్ లో తీర్మానం ఆమోదం పొందినప్పటికీ, వీటిలో ఏదైనా దేశం వీటో వినియోగిస్తే అది చెల్లదు. కాగా, ఇప్పుడు వీగిపోయిన తీర్మానంపై యూఎన్ జనరల్ అసెంబ్లీలో త్వరలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే యూఎన్ ఎస్సీ తీర్మానాలకు మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. జనరల్ అసెంబ్లీ తీర్మానాలకు చట్టబద్ధత ఉండదు. అవి కేవలం ప్రపంచ దేశాల అభిప్రాయాలను తెలియజేస్తాయి.