రష్యాలో భయం.. అందుకే దాడి తీవ్రత తగ్గించింది

రష్యాలో భయం.. అందుకే దాడి తీవ్రత తగ్గించింది

ఉక్రెయిన్ పై ఈ నెల 24న సడన్ గా యుద్ధం ప్రకటించి.. ఆ దేశ రాజధాని కీవ్ వరకూ చొచ్చుకొళ్లిన రష్యా ఇవాళ తమ అటాక్ తీవ్రతను, వేగాన్ని తగ్గించింది. రాజధాని వరకు రాగలిగిన రష్యన్ బలగాలకు.. కీవ్ నరగంలోకి ఎంటరయ్యాక మాత్రం తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఒక వైపు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యంపై క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లతో దాడి చేస్తుంటే.. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలు సైతం ఒక్కో యోధుడిలా తిరగబడుతున్నారు. ఆడామగ, చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధాలను చేపట్టి.. దేశాన్ని, రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. కొంత మంది పౌరులు తమ వాహనాల్లోని ఫ్యూయల్ తీసి.. పెట్రోల్ బాంబులు తయారు చేసి.. రష్యన్ యుద్ధ ట్యాంకర్లపై దాడి చేస్తున్నారు. దీంతో రష్యన్ ఆర్మీకి ఆ దేశం ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. సైనికుల ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగినట్లు ఉక్రెయిన్ మీడియా చెబుతోంది. దీంతో రష్యాలో భయం మొదలైందని, ఆ దేశ బలగాలు దాడి తీవ్రతను, వేగాన్ని తగ్గించాయని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. 

రష్యా మిలిటరీ ఆపరేషన్ ఫెయిల్

తమ దేశంలో మిలిటరీ, సివిలియన్ ఏరియాల్లో రష్యన్ బలగాలు దాడులకు పాల్పడ్డాయని, కానీ దురాక్రమణ ఆలోచనతో రష్యా చేసిన మిలిటరీ ఆపరేషన్ ఫెయిల్ అయిందని జనరల్ స్టాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఆర్మీ తక్కువ ఫోర్సెస్ తోనే రష్యా బలగాలను పెద్ద దెబ్బ తీసిందని, ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో రష్యా నైతిక స్థైర్యం కోల్పోయిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో రష్యన్ సైనికులు పోరాటానికి విముఖత చూపిస్తున్నారని పేర్కొన్నారు. శత్రుదేశం ఇప్పటికైనా రియాలిటీని గుర్తించిందని, ఉక్రెయిన్ ను చూసి రష్యా భయపడుతోందని అన్నారు.