ఆస్పత్రిపై 2 క్రూయిజ్ మిసైళ్లతో రష్యా దాడి

ఆస్పత్రిపై 2 క్రూయిజ్ మిసైళ్లతో రష్యా దాడి
  • రైల్వేస్టేషన్, హోటళ్లు, రేడియో స్టేషన్లు ధ్వంసం
  • ఉక్రెయిన్ రాజధాని శివార్లలో ఆగిపోయిన భారీ సైనిక కాన్వాయ్
  • ఇంధన సమస్యలు, ఉక్రెయిన్ ప్రతిఘటన వల్లే.. అమెరికా, బ్రిటన్ అంచనా
  • చెర్నిహివ్ లోని ఓ ఆస్పత్రిపై 2 క్రూయిజ్ మిసైళ్లతో రష్యా దాడి
  • ఇప్పటిదాకా 6400 మంది ఇండియన్లను తీసుకొచ్చిన కేంద్రం
  • అర్ధరాత్రి రాజధానిపైకి నాలుగు భారీ మిసైళ్లు

కీవ్/మాస్కో: రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్ ప్రతిఘటన కొనసాగుతున్నది. పోర్ట్‌‌‌‌ సిటీ ఖెర్సన్‌‌‌‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రష్యా.. రాజధాని కీవ్, రెండో అతిపెద్ద సిటీ ఖార్కివ్‌‌‌‌ అధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ ఉక్రెయిన్ మాత్రం పట్టు వదలడం లేదు. వెనక్కి తగ్గడం లేదు. స్థానిక పరిస్థితులను అనువుగా చేసుకుని ప్రత్యర్థిని గట్టిగా దెబ్బతీస్తోంది. మరోవైపు రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. దీంతో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్నాయి. నిరంతర షెల్లింగ్‌‌‌‌తో సిటీ మొత్తం ధ్వంసమవుతోంది. కీవ్ శివార్లలో రెండు సైన్యాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. ఎంత మంది, ఎన్ని ఆయుధాలతో వచ్చినా తమను ఓడించలేరని జెలెన్‌‌‌‌స్కీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఉక్రెయిన్‌‌‌‌ డీమిలిటరైజ్ చేసి తీరుతామని పుతిన్ స్పష్టం చేస్తున్నారు.

రాజధానిలో భారీ పేలుళ్లు
బుధవారం అర్ధరాత్రి నుంచి నాలుగు భారీ మిసైళ్లను కీవ్‌‌‌‌పై రష్యా ప్రయోగించింది. ఒకటి సెంట్రల్ రైల్వే స్టేషన్‌‌‌‌పై, మిగతా మూడు టీవీ, రేడియో స్టేషన్లపై పడ్డాయి. ఇబిస్ హెటల్‌‌‌‌లో భారీ పేలుళ్లు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ ఆఫీస్ చెప్పింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆఫీసు వీటికి దగ్గర్లోనే ఉంది. ఈ దాడులకు కొద్ది సేపటి ముందు సిటీ అంతటా, చుట్టుపక్క జిల్లాల్లో సైరన్లు మోగాయి. పేలుళ్ల తర్వాత కీవ్‌‌‌‌లోని బిల్డింగులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి. కీవ్‌‌‌‌తోపాటు ఒబ్లాస్ట్, ల్వీవ్, ఝితోమిర్, ఫ్రాంకివ్‌‌‌‌స్క్‌‌‌‌, చెర్నిహివ్, ఒడెస్సాలోనూ వైమానిక దాడి అలర్టులు జారీ చేశారు. చెర్నిహివ్‌‌‌‌లోని ఓ ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేశారు. ఆస్పత్రి ప్రధాన భవనం ధ్వంసమైంది. ఎంత మంది చనిపోయారనేది ఇంకా తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరియుపోల్‌‌‌‌లో రష్య షెల్లింగ్ కొనసాగింది. కనీసం ఒక టీనేజర్‌‌‌‌‌‌‌‌ చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఖార్కివ్‌‌‌‌లో పౌరులు ఉన్న ప్రాంతాల్లో మిసైల్ స్ట్రైక్స్ జరిగాయి.

ఖెర్సన్‌‌‌‌ నుంచి ఒడెస్సాకు..
ఖెర్సన్ చేజారడంతో ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన పోర్టు, నేవల్ బేస్ అయిన ఒడెస్సా వైపు రష్యా సైన్యం కదులుతోంది. ఇక్కడ భారీ స్థాయిలో షిప్పుల ద్వారా దాడి జరిగే అవకాశం ఉందని, రెండు వైపులా భీకర పోరాటం జరగొచ్చని అమెరికా హెచ్చరించింది. రష్యా నిరంతరం ఫైరింగ్ చేస్తుండటంతో వీధుల్లో గాయపడిన వారిని కూడా బయటికి తీసుకురాలేకపోతున్నామని మరియుపోల్ మేయర్ వాడిమ్ బోయిచెన్కో చెప్పారు.

ఈయూ తాత్కాలిక పర్మిట్లు
యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ దేశాల్లోకి వస్తున్న శరణార్థులకు తాత్కాలిక పర్మిట్లు ఇస్తామని ఈయూ కమిషన్ వెల్లడించింది. ఈయూలోని 27 దేశాల్లో చదువుకునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది.

బంగ్లా నౌకపై దాడి!
నల్ల సముద్రపు ఓడరేవులోని ఓల్వియాలో నౌకపై జరిగిన దాడిలో బంగ్లాదేశ్ నావికుడు చనిపోయాడని షిప్పింగ్ కంపెనీ గురువారం తెలిపింది. బంగ్లార్ సమృద్ధి షిప్పు ఫిబ్రవరి 22న ఇక్కడికి వచ్చిందని, యుద్ధం కారణంగా తిరిగి వెళ్లలేకపోయిందని చెప్పింది. బాంబు దాడి జరగడంతో నౌక ధ్వంసమైందని, ఎవరు దాడి చేశారనేది తెలియలేదని పేర్కొంది. ఒక ఇంజనీర్ చనిపోగా, 28 మంది క్రూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని వివరించింది.

పడమటోళ్లకి అణుయుద్ధం గురించే ఆలోచన: రష్యా
పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు ఆణుయుద్ధం గురించిన ఆలోచనలు చేస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్ లవ్‌‌‌‌రోవ్ ఆరోపించారు. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. అది అణు విధ్వంసమేనని మళ్లీచెప్పారు. గురువారం రష్యన్, ఫారిన్‌‌‌‌ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘అణు యుద్ధం ఆలోచన పాశ్చాత్య రాజకీయ నాయకుల తలల్లో నిరంతరం తిరుగు తోంది. ఆ ఆలోచనలు రష్యన్ల మనసు ల్లో లేవు’’ అని అన్నారు. తమను ఎంత రెచ్చగొట్టినా సహనాన్ని కోల్పోబోమని చెప్పారు. అమెరికాను.. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్, హిట్లర్‌‌‌‌‌‌‌‌తో పోల్చారు.

పౌరులను కాల్చొద్దు.. రష్యన్లకు ఖెర్సన్ మేయర్ రిక్వెస్ట్
ఖెర్సన్.. రష్యా స్వాధీనంలోకి వచ్చిన తొలి, మేజర్ సిటీ. తాము బుధవారమే అధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించగా.. గురువారం ఈ విషయాన్ని ఖెర్సన్ మేయర్ ఒప్పుకున్నారు. స్థానిక పౌరులు రష్యా సైనికులు చెప్పినట్లు వినాలని ఆయన కోరారు. ప్రజలపై కాల్పులు జరపొద్దని రష్యన్ సైన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు.