శంషాబాద్ కు పే..ద్ద కార్గో విమానం..ఆంటోనోవ్ ఏఎన్124 రుస్లాన్ ల్యాండింగ్

శంషాబాద్ కు పే..ద్ద కార్గో విమానం..ఆంటోనోవ్ ఏఎన్124 రుస్లాన్ ల్యాండింగ్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్​124 రుస్లాన్ ల్యాండయ్యింది. రుస్లాన్​అంటే రష్యన్​అని అర్థం.. దీన్ని సైనిక, వాణిజ్య అవసరాల కోసం తయారు చేశారు. మొదటిసారిగా1986లో సోవియట్ ఎయిర్ ఫోర్స్‌‌‌‌లో ప్రవేశపెట్టారు. ఇలాంటి విమానాలు 55కి పైగా ఉన్నాయి. వీటిని అప్పట్లో సోవియెట్​యూనియన్​(ఉక్రెయిన్)​లో తయారు చేసేవారు. యుద్ధం తర్వాత ఉత్పత్తి ఆగిపోయింది. 

సైజులు చూస్తే ఔరా అనాల్సిందే..

ఈ విమానం ఎత్తు 20.78 మీటర్లు కాగా,  పొడవు 69.10 మీటర్లు, వెడల్పు (వింగ్ స్పాన్) 73.3 మీటర్లు ఉంటుంది. నాలుగు లక్షల కిలోల బరువుతో టేకాఫ్​అయ్యే సామర్థ్యం దీని సొంతం. గంటకు 750 కిలోమీటర్ల నుంచి 850 కి.మీ వరకు వెళ్లగలదు. గరిష్టంగా 150 టన్నుల లోడ్​తో నాన్​స్టాప్​గా 14 వేల కిలోమీటర్లు ప్రయాణించగలగడం దీని స్పెషాలిటీ. ఈ విమానం వెనక ర్యాంప్​లు 36.5 మీటర్లుండడం వల్ల భారీ మెషినరీని ఈజీగా లోడ్​ చేయొచ్చు. ఇందులో సైనిక ట్యాంకులు, హెలీకాప్టర్లు, ఇతర భారీ సామగ్రి రవాణా చేయొచ్చు. దీంతో ఈ విమానానికి విపరీతమైన డిమాండ్​ఉంది. ఇది బోయింగ్ సీ 17 గ్లోబ్‌‌‌‌మాస్టర్ 3 కంటే కూడా పెద్దది.ఆంటోనోవ్ ఏఎన్​124  కంటే పెద్దదైన ఆంటోనోవ్ An-225 మ్రియా 2022లో రష్యా-–ఉక్రెయిన్ యుద్ధంలో ధ్వంసమైంది.

శంషాబాద్​ ఎందుకు వచ్చినట్టు ? 

ఈ విమానం ముందు శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్టుకు వచ్చింది. అక్కడి నుంచి గురువారం శంషాబాద్​లో ల్యాండయ్యింది. రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​నుంచి ఇతర దేశాలకు కార్గో రవాణా కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది గత అక్టోబర్ 10న కూడా వచ్చింది. దీని ల్యాండింగ్​తో శంషాబాద్​ఎయిర్​పోర్టుకు 
కొత్తందం వచ్చింది.