భారత్ బలమైన దేశం: రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్ బలమైన దేశం: రష్యా అధ్యక్షుడు పుతిన్
  • మోదీ నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చెందుతున్నది: పుతిన్
  • రష్యా నుంచి ఇండియాను దూరం చేసే ప్రయత్నాలు అర్థరహితం
  • రష్యాపై అణుదాడి గురించి ఆలోచన కూడా చేయొద్దని వార్నింగ్​

మాస్కో: ప్రపంచంలో భారత్ బలమైన దేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత బలంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. తమ పౌరుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ‘‘తమ గుత్తాధిపత్యాన్ని అంగీకరించని దేశాలను శత్రువులుగా చూపేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా సహా అన్ని దేశాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. 

అయితే తమ దేశ ప్రయోజనాల కోసం ఇండియా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. రష్యా నుంచి భారత్‌‌‌‌ను దూరం చేసే ప్రయత్నాలు అర్థరహితం. ఎందుకంటే ఇండియా స్వతంత్ర దేశం” అని చెప్పారు. రష్యా నుంచి ఆయిల్‌‌‌‌ను తక్కువ ధరకు ఇండియా కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాలు తీవ్ర విమర్శలు చేయడాన్ని ఉద్దేశిస్తూ పుతిన్ ఈ కామెంట్లు చేశారు. 

సోచిలో జరిగిన ‘వల్డయ్ డిస్కషన్ క్లబ్‌‌‌‌’ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 7% కన్నా ఎక్కువ ఆర్థిక వృద్ధి ఉంది. అది శక్తిమంతమైన, అద్భుతమైన దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్​ మరింత బలంగా అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు. రష్యా మాదిరే ఇండియాకు సరిహద్దుల్లేవని చెప్పారు.

గ్రనేడ్ పేలడం వల్లే ప్రిగోజిన్ చనిపోయాడు

వాగ్నర్ గ్రూప్ అధినేత, తన ఒకప్పటి అనుచరుడు ప్రిగోజిన్ అనుమానాస్పద మృతిపై పుతిన్ స్పందించారు. విమానంలో ఉన్న గ్రనేడ్ పేలడం వల్లే ప్రిగోజిన్ చనిపోయారని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాల్లో హ్యాండ్ గ్రనేడ్ శకలాలు కనిపించాయని తెలిపారు. 

ఎప్పటికీ వ్యతిరేకమే..

నాటోలో ఉక్రెయిన్‌‌‌‌ను చేర్చుకోవడాన్ని తాము ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని పుతిన్ స్పష్టంచేశారు. తమ భద్రతకు ముప్పు కలిగించేందుకు.. ఏకంగా తమ సరిహద్దుల వరకు నాటో విస్తరిస్తున్నదని చెప్పారు. ‘‘నాటో అనేది నిజానికి అమెరికా విదేశాంగ విధానంలోని ఓ టూల్’’ అని విమర్శించారు. విదేశీ సాయం ఆగిపోతే.. ఉక్రెయిన్ ఎకానమీ, మిలిటరీ పవర్ ఒక వారానికి మించి ఉండదని అన్నారు. యూరప్ తన సొంత ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఖర్చుతో ఉక్రెయిన్‌‌‌‌కు సాయం చేస్తోందన్నారు. 

నాజీ సైన్యంతో కలిసి పని చేసిన ఉక్రెయిన్ సైనికుడికి కెనడా పార్లమెంటులో స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం అసహ్యకరమని మండిపడ్డారు. ఉక్రెయిన్‌‌‌‌ను ‘డీనాజిఫై’ చేయాలన్న మాస్కో నిర్ణయం సరైనదేనని తేలిపోయిందన్నారు.

మళ్లీ న్యూక్లియర్ పరీక్షలు..

న్యూక్లియర్ పరీక్షలను తిరిగి ప్రారంభిం చే అవకాశం ఉందని పుతిన్ చెప్పారు.  అణు సామర్థ్యం గల క్రూయిజ్ మిసైల్‌‌‌‌ ‘బ్యూరేవెస్ట్‌‌‌‌నిక్‌‌‌‌’ను విజయవంతంగా పరీక్షించామన్నారు. ‘రష్యాపై అణ్వాయు ధాలను ప్రయోగిం చాలనే ఆలోచన కూడా చేయొద్దు. అలాంటి ప్రయత్నాన్ని మేం గుర్తిస్తే.. వందల వేల మిసైళ్లు ప్రయోగిస్తాం” అని హెచ్చరించారు.