శ్రీవారిని దర్శించుకున్న రష్యన్‌ మహిళ ఎస్తర్

శ్రీవారిని దర్శించుకున్న రష్యన్‌ మహిళ ఎస్తర్

తిరుపతి: ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చి లాక్‌డౌన్‌, ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా ఇండియాలోనే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తన ప్రతినిధులను ఎస్తర్‌ వద్దకు పంపించి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే అధికారులు చెప్పారు. కాగా.. సినీ నటుడు సోనూ సూద్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. తన వంతుగా ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది. రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్‌(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్‌ దీపా వెంకట్‌ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్‌- తెలుగు, రష్యన్‌ -హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో చిక్కుకున్న ఒలివియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. రష్యాకు చెందిన ఎస్తర్‌‌ ఆధ్యాత్మిక యాత్ర కోసం ఇండియాకి వచ్చింది. లాక్‌డౌన్‌, ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయింది. తన తల్లిని చూడాలని ఆమె బాధపడ్డారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు ఆమె గురించి ప్రసారం చేశాయి.