ఇయ్యాల్టి నుంచి రైతుబంధు

ఇయ్యాల్టి నుంచి రైతుబంధు
  • తొలిరోజు 19.98 లక్షల మంది ఖాతాల్లో రూ.586.65 కోట్లు
  • మొత్తం 68.94 లక్షల మంది రైతులు అర్హులు
  • ఈ సీజన్‌‌‌‌లో రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులకు మంగళవారం నుంచి రైతుబంధు నిధులు అందనున్నాయి. రైతుల వివరాలను వ్యవసాయ శాఖకు సీసీఎల్‌‌‌‌ఏ అందించింది. తొలి రోజున ఎకరం వరకు భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించనున్నారు. రోజు వారీగా ఎకరం చొప్పున పెంచుతూ అర్హులైన రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థిక శాఖకు అందజేసింది. సీసీఎల్‌‌‌‌లో నమోదైన పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 68.94 లక్షల మంది రైతుబంధుకు అర్హులని గుర్తించారు. ఈ మేరకు రాష్ట్రంలోని కోటి 53 లక్షల 11 వేల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. ఈ వానాకాలంలో పంపిణీ చేసేందుకు రూ.7,654.43 కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ నిర్ధారించింది. తొలి రోజు 19.98 లక్షల మంది ఖాతాల్లో రూ.586.65 కోట్లను జమ చేయనున్నారు.

3.64 లక్షల మంది వివరాలు అప్‌‌‌‌లోడ్ కాలే

రాష్ట్రంలో 68.94 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా.. వారిలో 61.5 లక్షల మందికి గత సీజన్‌‌‌‌లో రైతుబంధు సక్సెస్‌‌‌‌ ఫుల్‌‌‌‌గా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. 19,805 మంది రైతుల ఖాతాల్లో నిధులు వేయగా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్) ఫెయిల్యూర్‌‌‌‌ అయ్యాయి. మరో 3.64 లక్షల మంది కొత్త పట్టాదారులకు సంబంధించిన వివరాలు ఏఈవోల వద్ద అప్‌‌‌‌లోడ్‌‌‌‌ కాకుండా పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 15,625 మంది రైతులకు సంబంధించి వివరాలు నమోదు సరిగ్గా లేకపోవడంతో డీఏవోలు ఏఈవోలకు రిటర్న్‌‌‌‌ పంపించారు. బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీ కోడ్‌‌‌‌ సరిగా నమోదు కాకపోవడంతో 2,986 మంది రైతుల బ్యాంకు ఖాతాలు ఇన్‌‌‌‌ వ్యాలీడ్‌‌‌‌గా అధికారులు గుర్తించారు.

పాత పట్టా పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు ఉన్న 1.71 లక్షల మంది రైతులకు సంబంధించి బ్యాంకు వివరాలు నమోదు కాలేదని తేలింది. వీటి బ్యాంకు అకౌంట్‌‌‌‌ వివరాలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాల్సి ఉంది. మరోవైపు 1,70,097 మంది రైతులు వివిధ కారణాలతో స్టాప్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ (చెల్లింపులు నిలిపేయడం) కేటగిరీలో ఉన్నారు. వీరిలో కొంత మంది మాత్రమే ‘గివిటప్‌‌‌‌ (రైతుబంధును వదులుకోవడం)’కు అంగీకారం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా ఖాతాలు మాత్రం వివిధ కారణాలతో స్టాప్‌‌‌‌ పేమెంట్‌‌‌‌లో ఉన్నాయి.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి

రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌‌‌‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థికపరమైనఅడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి అన్నారు. మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత ఏఈవోలను కలిసి పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్‌‌‌‌ వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.