
యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. ఇదే విషయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో వెల్లడించారు. పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా తొలిరోజు 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్‌లలో 607.32 కోట్లు జమ చేయబడ్డాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. తొలిరోజు ఎకరం లోపు రైతులకు నగదును వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఇక ఈ సీజన్‌లో 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ సీజన్‌లో 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు. గత తొమ్మిది విడతల్లో కలిపి మొత్తం రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశామన్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న పదో విడతతో కలిపితే ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరుతుందని చెప్పారు.