
కొత్తపల్లి, వెలుగు : భూసమస్యతో నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్అనుబంధ గ్రామం ఐలోనిపల్లికి చెందిన రైతు ఎనుగుల మల్లేశం (55) ఆత్మహత్య చేసుకోగా... అతడు మంత్రి గంగుల కమలాకర్‌కు రాసినట్టుగా చెబుతున్న ఓ సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. మల్లేశం గురువారం కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చనిపోయేముందు మంత్రి గంగుల కమలాకర్‌కు సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలుస్తోంది. అందులో ‘గంగుల కమలాకర్ సార్ కు... నేను మల్లేశం..నా భూసమస్య పరిష్కరించాలని రెండేండ్ల నుంచి తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. నాలుగు సార్లు ప్రజావాణిల అప్లికేషన్ ఇచ్చిన. కానీ, ఏ పని చేయడం లేదు. అందుకని బాధతో చావాలని పురుగుల మందు తాగుతున్నా. నా పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటూ సచ్చిపోతున్నా’ అని అందులో రాశాడు. అయితే ఈ లెటర్ మల్లేశం రాసిందేనని కొంతమంది చెబుతుండగా అతడి కుటుంబసభ్యులు మాత్రం నోరు విప్పడం లేదు.