క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టెండూల్కర్ కొడుకుగా ఇప్పటికే అర్జున్ ప్రపంచానికి తెలుసు. ఇండియా తరపున ఆడకపోయినా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ టెండూల్కర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అర్జున్ ఈ సంవత్సరం మార్చి 5, 2026న సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. సచిన్ కొడుకు పెళ్లి వార్త వినగానే అయన అభిమానులు సానియా గురించి, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.
సానియా చందోక్ ఏం చేస్తారు
సానియా చందోక్ తన స్కూల్ ఎడ్యుకేషన్ ను ముంబైలోని బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్, ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో పూర్తి చేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో చదువుకుంది. అక్కడ సానియా 2020లో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీని పూర్తి చేశారు. సానియా 2024లో వరల్డ్‌వైడ్ వెటర్నరీ సర్వీస్ యొక్క ABC ప్రోగ్రామ్ నుండి వెటర్నరీ టెక్నీషియన్‌గా సర్టిఫికేషన్ పొందింది.
జంతువుల పట్ల ఉన్న ఇష్టంతో సానియా 2022లో ముంబైలో లగ్జరీ పెట్ గ్రూమింగ్, కేర్ బ్రాండ్ అయిన మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ LLPని ప్రారంభించింది. ఈ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు సేవలను అందిస్తుంది. గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఇది భారత్‌లో మొదటి లగ్జరీ పెట్ స్పా అని చెప్పొచ్చు. ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ. 90 లక్షలు. ప్రస్తుతం ముంబైలో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి.
సానియా ఫ్యామిలీ విషయానికి వస్తే?
సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె తాత రవి ఘాయ్ గ్రావిస్ గ్రూప్ యజమాని. ఘాయ్ కుటుంబం హోటల్ అండ్ ఆహార పరిశ్రమలో ఎక్కువ వినిపించే పెద్ద పేరు. వీరికి ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ (ఐస్ క్రీం బ్రాండ్) వంటి వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాదు, ముంబైలోని ఇంటర్ కాంటి నెంటల్ హోటల్ కూడా వీళ్లదే. ఈ గ్రూప్ 2023-24లో రూ. 624 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ. ఆహారం, ఆతిథ్య రంగంలో వీళ్ల సామ్రాజ్యం కొనసాగుతోంది.
