బీసీసీఐ జీఎం పదవికి మాజీ క్రికెటర్ రాజీనామా

బీసీసీఐ జీఎం పదవికి మాజీ క్రికెటర్ రాజీనామా

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం బీసీసీఐ జనరల్ మేనేజర్‌‌గా క్రికెట్ ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సబాను ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా బోర్డు పెద్దలు ఆదేశించారని సమాచారం. ‘అవును, అతడికి రిజైన్ చేయాలని చెప్పారు. కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో డొమెస్టిక్ క్రికెట్‌ నిర్వహణకు ఆయన సరిగ్గా ప్లాన్ చేయకపోవడం దీనికో కారణం. మేం ఆయన రాజీనామాను అందుకున్నాం. ఇప్పుడు అతడు నోటీస్ పీరియడ్‌లో ఉంటాడు. క్రికెట్ ఆపరేషన్స్‌ కోసం కొత్త జీఎం పోస్ట్‌కు అర్హుడ్ని బోర్డు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆఫీస్ బేరర్స్‌కు అపెక్స్ కౌన్సిల్ అధికారాలు అప్పగించింది’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. 52 ఏళ్ల సబా.. టీమిండియా తరఫున ఒక టెస్టుతోపాటు 34 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎంగా 2017 డిసెంబర్‌‌లో సబా బాధ్యతలు స్వీకరించాడు.

కరోనా కేసులు పెరుగుతున్నందున డిసెంబర్‌‌కు ముంందే మొదలవ్వాల్సిన డొమెస్టిక్ క్రికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ సెప్టెంబర్–నవంబర్‌‌లో ఐపీఎల్ జరిగితే నిర్ణీత సమయానికి డొమెస్టిక్ క్రికెట్ ప్రారంభం కాకపోవచ్చు. ఇకపోతే గత నెలలో బీసీసీఐ సీఈవో పదవికి రాహుల్ జోహ్రీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది సౌరవ్ గంగూలీ ప్రెసిడెంట్‌గా కొత్త ఆఫీస్ బేరర్లు బాధ్యతలు చేపట్టడంతో అప్పుడు బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ కూడా రాజీనామా చేసిన విషయం విధితమే.